తెలంగాణ

telangana

ETV Bharat / business

EPS పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్‌ - ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకునే వీలు - Pension Withdrawal From Any Bank - PENSION WITHDRAWAL FROM ANY BANK

Pension Withdrawal From Any Bank : ఈపీఎఫ్​ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా, ఏ బ్రాంచ్​ నుంచైనా మీరు పెన్షన్ పొందవచ్చని స్పష్టం చేసింది. అంటే మీకు నచ్చిన ఏ బ్యాంక్‌ నుంచైనా పింఛన్​ తీసుకునే వెసులుబాటు కలగనుంది.

EPFO
EPFO (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 4:33 PM IST

Pension Withdrawal From Any Bank : ఈపీఎస్‌ పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్‌ నుంచైనా పెన్షన్‌ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్‌ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం వెల్లడించారు. 2025 జనవరి 1న ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీని వల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు.

ఈపీఎఫ్‌ఓ ఆధునికీకరణలో భాగంగా 'సెంట్రలైజ్డ్‌ పేమెంట్ సిస్టమ్‌'ను తీసుకురావడం ఓ కీలక మైలురాయి అవుతుందని మాండవీయ పేర్కొన్నారు. పింఛన్‌దారులు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌కు దీనితో పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. ఇకపై పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంక్‌ బ్రాంచ్​ నుంచైనా పింఛన్‌ పొందే వీలు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈపీఎస్​ పింఛన్‌దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు 'పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్‌ బదిలీ' చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఏదైనా బ్యాంక్​ను లేదా శాఖను మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సీపీపీఎస్‌ (సెంట్రలైజ్డ్​ పెన్షన్​ పేమెంట్ సిస్టమ్) సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుందని మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ జోనల్/ ప్రాంతీయ కార్యాలయాలు 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. దీనివల్ల పెన్షన్​ ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంక్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇకపై సెంట్రలైజ్డ్‌ విధానం వల్ల సదరు బ్యాంక్​ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం తప్పనుంది. అంతేకాక పెన్షన్ అమౌంట్​ విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంక్​ ఖాతాలో జమ అవుతుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా పింఛను పంపిణీ ఖర్చు కూడా తగ్గుతుందని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. తదుపరి దశలో ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్‌ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ మన్​సుఖ్​ మాండవీయ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details