Car Prices Hike 2025 India :కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. వాహనప్రియులు ఈ ఏడాది కొనుగోలు చేయాలేకపోయిన తమ ఫేవరెట్ కారును, కొత్త సంవత్సరంలోనైనా కొనాలని ప్లాన్స్ వేసుకుంటారు. దేశంలో పండగ సీజన్లో వాహనాల సేల్స్ పెరుగుతుంటాయి. దీంతో చాలా మంది కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతికే కారు కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే అలాంటి వారికి పలు కార్ల కంపెనీలు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.
పలు దిగ్గజ కంపెనీలు వరుసగా ధరల పెంపుపై ప్రకటనలు చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ ధరల పెంపునపై ప్రకటన చేయగా, తాజాగా మారుతీ సుజుకీ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. 2025 జనవరి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. మరి ఇప్పటివరకు ఏఏ కంపెనీలు ధరలు పెంచాయి? ఏ మోడల్‌కు ఎంత మేర పెరగనుంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం!
మారుతీ సుజుకీ
భారత్ ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ శుక్రవారం ధరల పెంపుపై ప్రకటన చేసింది. తమ కంపెనీ కార్ల ధరలు గరిష్ఠంగా 4 శాతం పెరగనున్నట్లు వెల్లడించింది. అయితే కారు మోడల్, వేరియంట్ ఆధారంగా ధర ఉండనుంది. ఈ పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలు అవుతాయని పేర్కొంది.
హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కూడా కార్ల ధరలను పెంచనుంది. ఈ మేరకు గురువారం ప్రకటించింది. హ్యుందాయ్‌లో అన్ని మోడళ్లపై రూ.25 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. పెరిగిన ధరలు 2025 జనవరి 1 నుంచే అమలు కానున్నాయి.