Car Loan Prepayment :కారు లోన్‌ను గడువుకు ముందే, మొత్తంగా లేదా పాక్షికంగా చెల్లించాలనుకుంటే, ముందుగా రుణదాతకు ఆ విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొంతమేర అదనపు రుసుములు వసూలు చేస్తారని మర్చిపోవద్దు. కాబట్టి, ముందుగానే వీటి గురించి తెలుసుకుంటే మంచిది. అయితే ఇలాంటి పద్ధతులు బ్యాంకులు/ఆర్థిక సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. మిగిలిన లోన్ మొత్తంపై ఒక శాతం నుంచి ఆరు శాతం వరకూ రుసుము ఉండొచ్చు.
- ముందుగా మీ లోన్ అగ్రీమెంట్‌ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. గడువుకు ముందే రుణం తీర్చడానికి సంబంధించిన నిబంధనలు, షరతులు ఇందులో ఉంటాయి.
- మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకోండి. ముందస్తు చెల్లింపు చేయడం వల్ల, మీ ఇతర ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి.
- లోన్ మొత్తం, దానిపై రుసుములు అన్నీ స్పష్టంగా తెలుసుకోండి.
- ఏ రోజున మీరు చెల్లిస్తారన్నదీ రుణదాతకు స్పష్టంగా తెలియజేయండి.
- రుణాన్ని పూర్తిగా తీర్చేసిన తర్వాత, రుణదాత నుంచి తగిన ధ్రువీకరణలను తీసుకోవడం మర్చిపోవద్దు.
అదనపు చెల్లింపులతో
కారు లోన్‌కు నెలవారీ వాయిదాలతో పాటు అప్పుడప్పుడూ అదనంగా కొంత మొత్తం చెల్లించే ప్రయత్నమూ చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల వాహన రుణం 9 శాతం వడ్డీతో 5 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుంటే, దీనికి నెలకు రూ.10,380 వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి రూ.5,000 అదనంగా చెల్లించడం వల్ల లోన్‌ను 4 ఏళ్ల 7 నెలల్లోనే తీర్చేయొచ్చు. దీని వల్ల మొత్తం వడ్డీ భారం దాదాపు రూ.10వేల వరకూ తగ్గుతుంది.