Buying Car Tyres Tips: కారు మంచి కండీషన్లో ఉండాలంటే అన్ని భాగాలు కర్టెక్‌గా ఉండాలి. కారు కండీషన్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే కారుకు వినియోగించే స్క్రూ నుంచి టైర్ల వరకు అన్ని ముఖ్యమే. మనిషికి కాళ్లు ఎలాగో వాహనాలకు టైర్లు అలాగే. సరైన నాణ్యత లేని టైర్లు వాడడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడతారు. నాణ్యత లేని టైరు కొంటే అది మాటిమాటికి ప్యాచ్ అయిపోవడం, పేలడం జరగొచ్చు. అలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
టైర్ జీవితకాలం, వాతావరణం, రోడ్లు, డ్రైవింగ్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. మీ టైర్ అరిగిపోయిందని భావించినప్పుడు రీప్లేస్‌మెంట్ కోసం షోరూమ్‌కు వెళ్లినప్పుడు మీ కారు టైర్ సైజు చూసుకోవాలి. సాధారణంగా టైర్ సైజ్ దాని సైడ్‌వాల్‌పై ఉంటుంది. కాబట్టి మీరు కొత్త టైర్లను కొనుగోలు చేసేటప్పుడు పాతటైరు సైజును చెక్ చేసుకోవడం ముఖ్యం.
తరచూ చెక్ చేసుకోవాలి
కొత్త టైరు కొనుగోలు చేసేటప్పుడు దానిపై ముద్రించిన తయారీ తేదీని తనిఖీ చేయండి. ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే కారు టైర్లు రబ్బరుతో తయారవుతాయి. ఇవి కాలక్రమేణా పాడవుతుంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే వాతావరణ పరిస్థితులు వేడిగా ఉంటాయి. అందువల్ల టైర్‌ను కొనుగోలు చేసేటప్పుడు తయారీ తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. టైర్లను క్రమం తప్పకుండా వాహనదారులు చెక్ చేసుకోవాలి. అవి అరగగానే వెంటనే కొత్తది వేసుకోవడం ఉత్తమం. మెకానిక్ దగ్గరకు వెళ్లి కొత్త టైర్ మార్చుకోవాలా అని అడిగినా అతడే సలహా ఇస్తాడు.