Buying A House With Loan : రుణం అనేది ఎప్పటికీ భారమైనదే. కానీ ఇల్లు కోసం, పెళ్లి కోసం అప్పు చేయక తప్పదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అప్పు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అది మనకు గుదిబండగా మారకుండా ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసేవారు హోమ్ లోన్ తీసుకోవడం అనేది సహజమైన విషయమే. అయితే తొలిసారిగా ఇంటి రుణం తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీర్ఘకాలిక రుణం
హోమ్ లోన్ అనేది ఒక దీర్ఘకాలిక రుణం. దీనిని తీర్చడానికి సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. అందుకే గృహ రుణం తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రోజువారీ, కనీస అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మీరు చెల్లించే నెలసరి వాయిదాలు (ఈఎంఐ)లు ఉండేలా చూసుకోవాలి. అలాగే మీకు భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాన్ చేసుకోవాలి. మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు సైతం మీరు చెల్లించే ఈ నెలవారీ వాయిదాలు అడ్డంకిగా మారకుండా జాగ్రత్తపడాలి.
అవసరం మేరకే రుణం
మీరు గృహ రుణం తీసుకునే ముందు, మీ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా మీ కనీస అవసరాలు, ఇంటి ఖర్చులు, చేయవలసిన పొదుపు మొదలైన వాటిని బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతనే మీరు గృహ రుణం ఎంత తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే మీరు నెలవారీగా వాయిదాలు చెల్లించడం సులభం అవుతుంది. కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ మీ స్తోమతకు మించి అప్పు చేయకుండా జాగ్రత్తపడాలి.
లోన్ అమౌంట్ ఎక్కువగా ఉండాలంటే?
మీ మొత్తం ఆదాయంలో 35 శాతం కంటే తక్కువ రుణ చెల్లింపులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు బ్యాంకులు లోన్ మంజూరు చేయడానికి ఇష్టపడతాయి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు లోన్ అప్రూవ్ చేయడానికి ముందు మీ ఆదాయాన్ని, మీకు ఉన్న ఇతర అప్పులను బేరీజు వేస్తూ ఉంటాయి. మీకు ఇతర ఆదాయాలు ఉన్నట్లయితే వాటిని బ్యాంకుకు తెలియజేయడం మంచిది. దీని వల్ల మీకు ఎక్కువ మొత్తంలో లోన్ లభించే అవకాశం ఉంటుంది.