Budget 2025 Tax Relief :రూ.24 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపు రూ.1.10 లక్షల ఆదాయపు పన్ను ఆదా అవుతుంది. ఏటా రూ.12 లక్షలు సంపాదించే వారు ఇక పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు. వారికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.80వేల దాకా ఆదాయపు పన్ను మిగులు లభిస్తుంది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఈమేరకు ఆదాయపు పన్ను శ్లాబ్‌లను సమూలంగా మార్చారు. రూ.12 లక్షల దాకా వార్షిక ఆదాయం కలిగిన వారికి ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు కల్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఈ పన్ను మినహాయింపు పరిమితి ఉద్యోగ వర్గం వారికి రూ.12.75 లక్షల వార్షిక వేతనం దాకా ఉంటుందన్నారు. వారి కోసం రూ.75వేలను అకౌంట్ స్టాండర్డ్ డిడక్షన్‌గా పరిగణిస్తామని వెల్లడించారు.
రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షల దాకా
ఏటా రూ.13 లక్షల ఆదాయాన్ని సంపాదించే వారికి రూ.25వేలు, రూ.14 లక్షల సంపాదనపరులకు రూ.30వేలు మేర ఆదాయపు పన్ను ఆదా అవుతుంది. సంవత్సరానికి రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.35వేలు, రూ.16 లక్షల సంపాదనపరులకు రూ.50వేలు, రూ.17 లక్షలు సంపాదించే వారికి రూ.60వేలు, రూ.18 లక్షలు సంపాదించే వారికి రూ.70వేల ఆదాయపు పన్ను మిగులుతుంది. ఏటా రూ.19 లక్షలు సంపాదించే వారికి రూ.80వేలు, రూ.20 లక్షల సంపాదనపరులకు రూ.90వేలు, రూ.21 లక్షలు సంపాదించే వారికి రూ.95వేలు, రూ.22 లక్షల సంపాదనపరులకు రూ.లక్ష, రూ.23 లక్షలు సంపాదించే వారికి రూ.1.05 లక్షల మేర ఆదాయపు పన్ను సేవ్ అవుతుంది.
పన్ను శ్లాబ్స్ ఇవీ
ఏటా రూ.12 లక్షలకుపైగా వార్షిక ఆదాయాన్ని కలిగి ఉండి, నూతన పన్ను విధానం కింద ఐటీఆర్‌ను ఫైల్ చేసే వారిని ఉద్దేశించి బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ఈ కేటగిరీ వారు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించనున్న ఆదాయంపై ఎంత పన్ను విధించాలనే లెక్క వేసేందుకు పన్ను శ్లాబ్‌లలో సవరణలు చేశారు.