Bike Maintenance Tips : ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌కు, ఆఫీసుకు, ప్రయాణాలకు, సరదాగా బయటకు వెళ్లేందుకు, ఇలా ప్రతి దానికీ బైక్ ను వాడుతున్నారు. అయితే బైక్ కండిషన్ మంచిగా ఉంటేనే, ఎక్కువ కాలం రిపేర్లు రాకుండా ఉంటుంది. రెగ్యులర్‌గా బైక్ నిర్వహణ (మెయింటెనెన్స్) చూసుకుంటూ ఉంటే వాహనం పనితీరు బాగుంటుంది. అలానే ఎక్కువ కాలం వాడుకోవడానికి వీలవుతుంది. ఆకస్మాత్తుగా బ్రేక్ డౌన్లు లాంటివి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కొన్ని చిట్కాల వల్ల బైక్‌ల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. అలాగే వాటి లైఫ్‌స్పాన్‌ను పెంచుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా?
1. ఇంజిన్ ఆయిల్ మార్చాలి
ఇంజిన్ ఆయిల్ అనేది మన బైక్ ఇంజిన్ ఎక్కువ కాలం పని చేసేలా చేస్తుంది. ఇంజిన్‌ను వేడెక్కకుండా చల్లగా ఉంచుతుంది. కల్తీ ఇంజిన్ ఆయిల్ లాంటివి వాడినప్పుడు, ఇంజిన్ సామర్ధ్యం దెబ్బతింటుంది. అందుకే రెగ్యులర్‌గా ఆయిల్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇంజిన్ ఆయిల్‌ను మార్చుకోవాలి.
2. టైర్లను చెక్ చేసుకోవాలి
అరిగిపోయిన టైర్లతో బైక్‌ను నడపకూడదు. ఒకవేళ అరిగిన టైర్లతోనే బైక్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు టైర్లను తనిఖీ చేసుకుంటూ, అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవాలి. అలానే టైర్లలో సరిపడా గాలి ఉందా? లేదా? అనేది తరచూ చెక్ చేసుకోవాలి. టైర్లు మంచిగా ఉంటే సురక్షితంగా ప్రయాణించవచ్చు.
3. ఎయిర్ ఫిల్టర్లను క్లీనింగ్ చేయాలి
బైక్ ఎయిర్ ఫిల్టర్లను ఎప్పుటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకుంటే దుమ్ము, ధూళి ఫిల్టర్‌లో పేరుకుపోతే, బైక్ ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, అవసరమైతే దాన్ని మార్చేయడం మంచిది.
4. బ్రేకుల విషయంలో జాగ్రత్త
ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేవి బ్రేక్స్. అవి మరీ గట్టిగా లేదా మరీ లూజ్‌గా ఉండకూడదు. బ్రేక్ ప్యాడ్లు కాలక్రమేణా అరిగిపోతుంటాయి. వాటిని మార్చటం అవసరం. అలానే బ్రేక్ వేసేటప్పడు సౌండ్ ఏమైనా వస్తే, వెంటనే వాటిని మార్చాలి. అలానే బ్రేక్స్ సరిగ్గా పనిచేసేందుకు ఆయిల్ వేస్తూ ఉండాలి.
5. బైక్ మాన్యువల్ చదవాల్సిందే
వాహనాలను కొనేటప్పుడు మ్యానువల్ ఇస్తారు. దానిని చాలా మంది చదవకుండా పక్కన పడేస్తారు. దానిలో వాహనానికి సంబంధించిన ప్రతి భాగం గురించి వివరాలు ఉంటాయి. అలానే వాటి నిర్వహణ గురించి, అలానే ఎలాంటి ఆయిల్‌ను ఉపయోగించాలి? టైర్ల సంరక్షణ గురించి ఏం చేయాలి? ఇలా ప్రతి విషయం గురించి సమాచారం ఉంటుంది. కానీ చాలా మంది దానిని చదవకుండా పక్కన పడేస్తుంటారు. కానీ ఇది సరికాదు. కచ్చితంగా మాన్యువల్‌ను చదవాలి.
6. క్లచ్ అడ్జస్ట్మెంట్
టైర్ల లాగానే వివిధ బైక్‌లలో క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా భిన్నంగా ఉంటుంది. గేర్లను మార్చటం కోసం క్లచ్‌ను ఉపయోగిస్తుంటాం. ఒకవేళ క్లచ్ గట్టిగా లేదా వదులుగా ఉంటే గేర్లను మార్చేటప్పుడు సమస్యలు వస్తాయి. దాని వల్ల వాహనానికి డ్యామేజ్ కావచ్చు. కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు. బైక్ ఇంజిన్ సామర్థ్యం మంచిగా ఉన్నప్పటికీ, క్లచ్ సరిగ్గా లేకపోతే, బైక్ ఫ్యూయెల్ ఎఫీషియన్సీ తగ్గే అవకాశం ఉంటుంది.