Best Tips For Reverse Parking Car :కారును రయ్ రయ్ మంటూ.. ముందుకు ఎవ్వరైనా ఈజీగా నడిపేస్తారు. కానీ.. రివర్స్ చేయాల్సి వస్తేనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు! వెహికిల్ డ్యామేజ్ అయిపోతుంది. అంతేకాదు.. అక్కడ మనుషులు ఎవరైనా ఉంటే ప్రాణాలకూ ప్రమాదం జరగొచ్చు! అందుకే.. కారు రివర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కొన్నేళ్లుగా కారు డ్రైవింగ్ చేసేవారు ఈజీగా రివర్స్ చేస్తారు. కానీ.. ఈ మధ్యనే డ్రైవింగ్ నేర్చుకున్న వారు ఇబ్బంది పడతారు. ఇలాంటి వారు కారును రివర్స్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సైడ్ మిర్రర్ తప్పక చూడాలి :
మీరు ఏదైనా రోడ్డుమీద కారు రివర్స్ చేయాల్సి వస్తే.. వెనుక నుంచి జనాలు ఎవరైనా వస్తున్నారా? ఏవైనా వాహనాలు వస్తున్నాయా? అనే విషయాలను తప్పక గమనించాలి. ఇందుకోసం కచ్చితంగా సైడ్ మిర్రర్ చూసుకోవాలి. సైడ్ మిర్రర్తోపాటు ముందున్న అద్దంలో కూడా చూస్తూ.. జాగ్రత్తగా రివర్స్ చేయాలి. ఎవరూ లేరు, వాహనాలు ఏవీ రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే రివర్స్ చేయాలి.
అక్కడ పిల్లలుంటారు :
స్కూల్స్, గ్రౌండ్స్, అపార్ట్‌మెంట్స్, పార్క్‌ల దగ్గర చిన్న పిల్లలు ఎక్కువగా తిరుగుతుంటారు. కాబట్టి.. ఈ ప్లేస్‌లలో కారును రివర్స్ చేస్తున్నప్పుడు, పార్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు కారు వెనకాల ఉంటే.. డ్రైవర్‌కు కనిపించరు. అందువల్ల ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని.. పిల్లలు ఎవరూ లేరని చూసుకున్న తర్వాతే కారు రివర్స్ చేయాలని గుర్తుంచుకోండి.