Best Child Investment Plans In India : మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పొదుపు, మదుపు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ పెట్టుబడిపై గ్యారెంటీగా రాబడిని ఇచ్చే టాప్-5 పథకాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. NPS Vatsalya Scheme :పిల్లల పేరు మీద పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఎన్‌పీఎస్ వాత్సల్య. ఇది ఒక పెన్షన్ స్కీమ్. ఈ పథకంలో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. ఇది ప్రభుత్వ పథకం కనుక ఎలాంటి నష్టభయం ఉండదు. పైగా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి.
రెండు రకాల ఖాతాలు
ఎన్‌పీఎస్‌లో టైర్-1, టైర్-2 అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్-1 అనేది ఒక ప్రాథమిక పింఛను ఖాతా. ఇందులో ఉపసంహరణలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్-2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం లాంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ.50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. అదనంగా సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
పదవీ విరమణ తర్వాత (60 ఏళ్లు) ఎన్‌పీఎస్ నిధిలో నుంచి 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40% మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత పింఛను పొందేందుకు వీలవుతుంది.
2. Sukanya Samriddhi Yojana : ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. 10 ఏళ్లలోపు వయస్సున్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో 21 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కావాలని అనుకుంటే పాపకు 18 ఏళ్లు వచ్చిన తరువాత ఉన్నత విద్య, వివాహం కోసం 50 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ పథకం కనుక మీ పెట్టుబడికి, రాబడికి ఎలాంటి ఢోకా ఉండదు.
ఉదాహరణకు సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీరు ఏడాదికి రూ.1.50 లక్షలు చొప్పున డిపాజిట్ చేశారనుకుందాం. 21 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత 8.2శాతం వడ్డీ రేటుతో అది రూ.69 లక్షలు-రూ.70 లక్షలు అవుతుంది.
3. Recurring Deposits (RDs) : ఎలాంటి నష్టభయం లేకుండా మంచి రాబడి సంపాదించాలని అనుకునేవారికి రికరింగ్ డిపాజిట్స్ (ఆర్‌డీ) బాగుంటాయి. బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో రికరింగ్ డిపాజిట్లు ఓపెన్ చేయవచ్చు. దీర్ఘకాలంపాటు వీటిని కొనసాగిస్తే, పిల్లలు పెద్దవారయ్యే నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి.
వాస్తవానికి రికరింగ్ డిపాజిట్లలో మీరు రెగ్యులర్‌గా (నెలవారీగా) మీకు నచ్చినంత డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే, రికరింగ్ డిపాజిట్లో కూడా ఫిక్స్డ్ వడ్డీ రేటు ఉంటుంది. ఆర్‌డీ కూడా నిర్ణీత కాల వ్యవధి (ఫిక్స్డ్ టెన్యూర్) తరువాత మెచ్యూర్ అవుతుంది. కనుక మీకు ఎంత రాబడి వస్తుందో ముందే తెలిసిపోతుంది. ఎఫ్‌డీతో పోలిస్తే ఆర్డీలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు అవసరమైనప్పుడు రికరింగ్ డిపాజిట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అవసరమైతే ఆర్డీపై లోన్ కూడా తీసుకోవచ్చు.
4. Public Provident Fund (PPF) : దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. దీనిలో సంవత్సరాలనికి కనిష్ఠంగా రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు మదుపు చేయవచ్చు. 15 ఏళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీనిపై సమారుగా 8 శాతం వరకు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. అంతేకాదు సెక్షన్ 80 ప్రకారం, పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
5. Systematic Investment Plan (SIP) : మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో పెట్టుబడులు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్, ఈక్విటీ, హైబ్రిడ్ - ఇలా అనేక రకాలు ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతూ ఉంటాయి. కనుక భారీ లాభాలు వచ్చే అవకాశం ఎంత ఉంటుందో, నష్టపోయే ప్రమాదం కూడా అంతే ఉంటుంది. అందువల్ల ఇలాంటి పెట్టుబడుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.