Baby Millionaire Ekagrah Rohan Murty : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తి ఇటీవలే దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌గా అవతరించాడు. తాత కానుకగా అందించిన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లతో రూ.240 కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. తాజాగా డివిడెండ్ రూపంలో మరో రూ.4.2 కోట్లు సంపాదించి మరింత ఐశ్వర్యవంతుడయ్యాడు.
రూ.20+8 డివిడెండ్
ఇన్ఫోసిస్ బోర్డ్ ఒక్కో షేర్‌కు రూ.20 చొప్పున డివిడెంట్ అందించాలని నిర్ణయించింది. అలాగే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్పెషల్ డివిడెండ్‌గా మరో రూ.8 చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం డివిడెండ్‌ను ఈ జులై 1న చెల్లించనుంది.
1.51 కోట్ల షేర్లు!
నారాయణ మూర్తి గత నెలలో తన మనవడైనఏకగ్రహ్కు 15 లక్షల షేర్లను కానుకగాఇచ్చేశారు. ఇంకా ఆయన చేతిలో 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే 0.36 శాతం ఇన్ఫోసిస్ షేర్లు నారాయణ మూర్తి వద్ద ఉన్నాయి.
ముద్దుల మనవడు
నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులకు రోహన్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన భార్య అపర్ణ 2023 నవంబర్ 10న బెంగళూరులో ఏకగ్రహ్కు జన్మనిచ్చారు. దీనితో నారాయణ మూర్తి దంపతులు నాన్నమ్మ, తాతయ్యలు అయ్యారు. వాస్తవానికి నారాయణ మూర్తి దంపతులకు ఇంతకు ముందే కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు మనవరాల్లు ఉన్నారు. వీరిద్దరూ యూకే ప్రధాని రిషి సునాక్, అక్షత మూర్తిల పిల్లలు.