Personal Loan Dos And Don'ts :ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. ఆ సమయానికి మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. లేదా మన దగ్గరున్న సొమ్ము సరిపోకపోవచ్చు. కనుక అలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వడ్డీ రేట్లు : వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేటు తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. చాలా బ్యాంకులు 12 శాతం లేదా అంత కంటె ఎక్కువ వడ్డీ రేటును విధిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు 23 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. రుణ యాప్‌లైతే మరీ దారుణంగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. నకిలీ యాప్‌లైతే మిమ్మల్ని మోసం చేసి, భారీగా డబ్బులు కూడా దోచుకుంటాయి. కనుక అధిక వడ్డీ రేటున్న రుణాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అందుకే లోన్స్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, రుణ సంస్థలు విధిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి.
లోన్ వ్యవధి :పర్సనల్ లోన్స్ వ్యవధి సాధారణంగా 12-60 నెలల వరకు ఉంటుంది. కనుక మీరు రుణం సులువుగా తీర్చడానికి అవసరమైన, అనుకూలమైన వ్యవధిని ఎంచుకోండి. 36 నెలలకు మించి వ్యవధి ఉండకపోవడమే మంచిదని గుర్తుంచుకోండి.
బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ :పర్సనల్ లోన్స్‌ను ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. గతంలో బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని ఇచ్చేందుకు కనీసం నాలుగైదు రోజుల వ్యవధిని తీసుకునేవి. కానీ ఎన్‌బీఎఫ్‌సీలు, లోన్ యాప్‌లు క్షణాల్లోనే రుణాలను ఇచ్చేవి. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు, యాప్‌లు ఒకే విధంగా స్పందిస్తున్నాయి. దరఖాస్తు చేసి, కొన్ని లాంఛనాలు పూర్తి చేస్తే చాలు, లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాయి. అయినప్పటికీ రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఎందులో తీసుకోవాలనుకునేది మీరే నిర్ణయించుకోవాలి. సరళమైన షరతులు ఉన్నదాన్ని ఎంచుకోవడమే ఎప్పుడూ మంచిది. మీ అర్హతను బట్టి, ఎవరు ఎంత మేరకు రుణం ఇస్తున్నారన్నదీ చూసుకోండి.