Personal Loan Expert Tips : అత్యవసరంగా డబ్బు కావాలి ఎలా? అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మందికి గుర్తుకు వచ్చేది వ్యక్తిగత రుణం. బ్యాంకులు ముందస్తు ఆమోదంతో ఆఫర్ చేస్తుండడం, ఆన్లైన్లో తక్కువ సమయంలోనే ఆమోదించడం, హామీ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం - ఇటువంటి అనుకూలతలు ఉండడం వల్ల చాలా మంది పర్సనల్ లోన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. వాహన, గృహ రుణాలతో పోలిస్తేపర్సనల్ లోన్స్‌కు వడ్డీ ఎక్కువ ఉంటుంది. అందుకే బ్యాంకులు కూడా వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని ఉద్యోగి జీతాన్ని బట్టి ఇస్తాయి. అయితే వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణాలు ఎలా ఇస్తాయి? పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు పరిగణనలోని తీసుకోవాల్సిన విషయాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారీ వడ్డీ రేట్లు
డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎంత మొత్తం రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి. అయితే దరఖాస్తుదారుని అర్హత, క్రెడిట్ స్కోర్, రుణ కాలపరిమితిని బట్టి వీటి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. సాధారణంగా పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి 21 శాతం వరకు ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. అందుకే వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్సనల్ లోన్స్‌ను గృహ, వాహన రుణాల కంటే ఎక్కువ వడ్డీ రేటుతో ఇస్తాయి బ్యాంకులు. పైగా ఇవి అసురక్షిత రుణాలు కూడా. అందువల్ల మీ వార్షిక జీతం కంటే ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకోకూడదు. ఒక వేళ తీసుకుంటే, మీ ఆర్థిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
వారికి మాత్రమే లోన్స్!
ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి, బ్యాంకులు వారి మూడు నెలల పే స్లిప్‌లను ప్రూఫ్‌గా తీసుకుంటాయి. స్వయం ఉపాధి పొందే వారికి లోన్ ఇచ్చేటప్పుడు వారి డెబిట్, క్రెడిట్ కార్డ్ హిస్టరీని చూస్తాయి. దాదాపు 6-12 నెలల క్రెడిట్ హిస్టరీని పరిశీస్తాయి. చాలా బ్యాంకులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారికి మాత్రమే రుణాలు ఇస్తుంటాయి. సాధారణ కంపెనీల్లో పనిచేసేవారికి వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి ఇష్టపడవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.