Applying For Home Loan In 40s :మనలో చాలా మంది హోమ్ లోన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని అర్హతలు ఉన్నవారికి బ్యాంకులు లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అయితే 40 ఏళ్లు లేదా ఆ పైబడిన వారికి అన్ని అర్హతలు ఉన్నా బ్యాంకులు లోన్ ఇవ్వకపోవచ్చు. మరి దీనికి కారణం ఏమిటి? వయస్సు పైబడిన వాళ్లకి బ్యాంక్ లోన్స్ రావాలంటే ఏం చేయాలి? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
40 ఏళ్లు పైడినవారికి ఎదురయ్యే సమస్యలు ఇవే!
- ఒక వ్యక్తికి 40 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉంటే, అతను మరెంతో కాలం పని చేయలేకపోవచ్చు. అంటే త్వరలోనే అతని సంపాదన తగ్గే అవకాశం ఉంటుంది. కనుక బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడవు. ఒక వేళ లోన్ ఇచ్చినా అధికంగా వడ్డీ వసూలు చేస్తాయి.
- పెద్ద వయస్సువారిని బ్యాంకులు హై రిస్క్ బారోవర్స్‌గా పరిగణిస్తాయి. ఎందుకంటే, వీరిలో కొంత మందికి ఇప్పటికే చాలా రుణాలు, నేరవేర్చాల్సిన బాధ్యతలు ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కనుక క్రమం తప్పకుండా, అధికంగా ఆదాయం వచ్చే వారిని మాత్రమే బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. తక్కువ ఆదాయం ఉన్నవారిని పక్కన పెడతాయి.
- పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ వస్తుంది. కానీ మునుపటంత ఆదాయం రాదు. మరికొందరికి అయితే పూర్తిగా సంపాదన ఆగిపోతుంది. అందుకే బ్యాంకులు ఇలాంటి వారికి లోన్ ఇవ్వడానికి ఇష్టపడవు.
- కొన్ని సందర్భాల్లో 40 ఏళ్లు దాటిన వారికి బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. కానీ లోన్ డిఫాల్ట్ కాకుండా ఉండేందుకు - రీపేమెంట్ వ్యవధిని బాగా తగ్గిస్తాయి. దీని వల్ల నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది. సాధారణ జీతం సంపాదించేవాళ్లకు ఇది చాలా కష్టంగా ఉంటుంది. కానీ బ్యాంకులు ఇలా ఎందుకు చేస్తాయంటే, రుణగ్రహీత పదవీ విరమణ చేయకముందే మొత్తం ఇంటి రుణం తీర్చే విధంగా చూసుకుంటాయి.
కాస్త స్మార్ట్‌గా ఆలోచిస్తే సరి!
40 ఏళ్లు పైబడిన వాళ్లు ఇవన్నీ చూసి ఢీలా పడాల్సిన పనిలేదు. కాస్త స్మార్ట్‌గా ఆలోచించి, హోమ్ లోన్‌ను సులువుగా పొందవచ్చు. అలాగే దానిని చాలా సులువుగా తీర్చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- మన దేశంలో చాలా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అందించే హోమ్ లోన్స్‌ను ఒకదానితో మరొకటి సరిపోల్చి చూసుకోండి. మీరు భరించగలిగే వడ్డీ రేటుతో, లోన్ మంజూరు చేసే బ్యాంకును ఎంచుకోండి. మీ క్రెడిట్ స్కోర్ బాగుండి, మీకు రెగ్యులర్‌గా ఆదాయం వస్తుంటే, బ్యాంకులు మీకు హోమ్ లోన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒకేసారి పెద్ద సంఖ్యలో వివిధ బ్యాంకుల వద్ద లోన్ అప్లికేషన్‌లు పెట్టకూడదు. ఒక వేళ అలా చేస్తే మీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది.
- గతంలో మీరు తీసుకున్న రుణాలపై సమయానికి ఈఎంఐలు కడుతూ, ఎలాంటి డిఫాల్ట్‌లు లేకపోతే, మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది. ఇలా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఎప్పుడూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాయి. సులువుగా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తాయి.
- పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ చేసేవారికి కూడా బ్యాంకులు చాలా సులువుగా హోమ్ లోన్స్ మంజూరు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీత వయస్సును పెద్దగా పరిగణనలోకి తీసుకోవు. ఎందుకంటే వీరు ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టారు కనుక, తీర్చాల్సిన రుణ మొత్తం తక్కువగా ఉంటుంది. కనుక డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది.
- ఏది ఏమైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బ్యాంకు లోన్స్ కావాలంటే, వీలైనంత చిన్న వయస్సులో ప్రయత్నించడం మంచిది.