Alert To SBI Customers :సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రివార్డ్స్ పేరిట వాట్సప్ సందేశాలు పంపిస్తున్నారు. కొంత మందికి సాధారణ SMSల రూపంలోనూ మోసపూరిత లింకులు సెండ్ చేస్తున్నారు. వాటిపై క్లిక్ చేసి పలువురు వ్యక్తులు నష్టపోయిన ఘటనలూ తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందుకే ఎస్‌బీఐ తమ కస్టమర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేస్తోంది.
ఇదీ జరుగుతోంది!
వాట్సప్‌లో 'ఎస్‌బీఐ రివార్డ్స్' (SBI Rewardz) అనే ఫేక్ లింకు విస్తృతంగా ప్రచారమవుతోంది. అయితే ఈ లింక్ తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో, దాన్ని చూసినవారు నిజమని నమ్మేస్తున్నారు. చాలా సులభంగా మోసపోతున్నారు. ఉదాహరణకు ‘మీ ఎస్‌బీఐ రివార్డ్ రూ.7250 యాక్టివేట్ అయ్యింది. ఈ రోజుతో దీని గడువు ముగిసిపోతోంది. ఈ డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్ యాప్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. వెంటనే మీ అకౌంట్లోకి డబ్బులు జమ చేసుకోండి’ అంటూ సదరు మెసేజ్‌లో పేర్కొంటున్నారు. దానికి ఎస్‌బీఐ యోనో పేరిట ఓ ఫేక్ లింకును జత చేస్తున్నారు.
ఎస్‌బీఐ ఎలాంటి లింక్‌లు పంపదు!
ఈ నయా ఫ్రాడ్‌పై ఎస్‌బీఐ స్పందించింది. తమ కస్టమర్లకు ఎలాంటి లింక్‌లు పంపించమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అలాగే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరమని తెలిపింది. అందువల్ల వాట్సాప్‌ల్లో, ఎస్ఎంఎస్ల్లో వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.