Air India Vistara Merger :ఎయిర్ ఇండియా, విస్తారా విలీన ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దీనితో భారతీయ విమానయాన రంగంలో అతిపెద్ద విలీనంగా ఇది నిలిచింది. ఇకపై ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటిటీ వారానికి 5600 విమాన సర్వీసులను, 90 కంటే ఎక్కువ మార్గాల్లో నడపనుంది.
ఈ విలీనం ద్వారా ఎయిర్ఇండియాలోని 25.1 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకుంది. వాస్తవానికి 2022 జనవరిలో నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
మరో రూ.3,195 కోట్లు పెట్టుబడి
వాస్తవానికి విస్తారా అనేది టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన జాయింట్ వెంచర్. ఇందులో టాటా గ్రూప్‌నకు 51 శాతం వాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉండేది. 2015లో విస్తారా సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇది టాటా గ్రూప్‌నకే చెందిన ఎయిర్ ఇండియాలో వీలినం అయ్యింది. దీని తరువాత ఎయిర్ ఇండియాలో - సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరో రూ.3,195 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.
అక్టోబర్‌లో టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం అయ్యింది. తాజాగా విస్తారా విలీనం కావడం గమనార్హం. గతంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిరిండియాతో విలీనం అయ్యింది. ఎయిర్ సహారా జెట్ ఎయిర్‌వేస్‌లో కలిసిపోయింది. ఎయిర్ డెక్కన్ కూడా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైంది.
ఎయిరిండియా
నవంబర్ 12 నుంచి అన్ని విస్తారా విమానాలను ఎయిరిండియానే నిర్వహిస్తుంది. అలాగే ఎయిరిండియా వెబ్‌సైట్ నుంచే ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. విస్తారాకు చెందిన మొత్తం 2.7 లక్షల మంది కస్టమర్ల టిక్కెట్లు కూడా ఎయిరిండియాకే బదిలీ అవుతాయి. అంతేకాదు ఇప్పుడు విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన UKకోడ్ పూర్తిగా తొలిగిపోయింది. దీనికి బదులుగా ‘AI2XXXX’ అనే కొత్త కోడ్ వచ్చింది.
విస్తారా స్పెషాలిటీ!
విమానాల్లో స్టార్‌బక్స్ కాఫీని అందించిన మొదటి ఎయిర్‌లైన్స్ విస్తారా. విమానాలను శుభ్రం చేయడానికి మొదటిగా రోబోలు ఉపయోగించింది కూడా విస్తారానే. అంతేకాదు లాయల్టీ కస్టమర్లకు ఉచితంగా వైఫైని కూడా అందించింది.