Aadhaar-Ration Card Linking :ఆధార్- రేషన్ కార్డ్‌లను లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఆధార్-రేషన్ కార్డ్‌లను లింక్ చేసుకునేందుకు మరో 3 నెలలపాటు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి 2024 జూన్ 30తోనే గడువు ముగియనుండగా, దానిని ఈ సెప్టెంబర్ 30 వరకు పెంచింది.
దేశంలో రేషన్ కార్డులు విపరీతంగా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకొనేందుకు ఆధార్- రేషన్ కార్డ్‌లను కచ్చితంగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. దీనితో చాలా మంది వీటిని అనుసంధానం చేసుకున్నారు. అయితే ఇంకా అనుసంధానం చేసుకోనివారి కోసం మళ్లీ గడువు పెంచింది కేంద్రం.
నకిలీ రేషన్ కార్డులు తొలగించడం కోసం!
ఆధార్- రేషన్ కార్డు అనుసంధానం చేసుకోవడం వల్ల నకిలీ రేషన్ కార్డులను నిర్మూలించడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందించడానికి వీలవుతుంది. అందుకే ఇప్పటికీ ఆధార్-రేషన్ కార్డ్‌లను అనుసంధానం చేయని వారు, ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది.
లింక్ చేయడం ఎలా?
Aadhaar-Ration Card Linking Process :మీ సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) దగ్గరకు వెళ్లి ఆధార్-రేషన్ కార్డులను లింక్ చేయించుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్, రేషన్ కార్డులతోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కోరుకుంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్-రేషన్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. అది ఎలా అంటే?
- ముందుగా మీరు రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) పోర్టల్ ఓపెన్ చేయాలి.
- అందులో Link Aadhaar with the active ration card ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ రేషన్ కార్డ్, ఆధార్ నంబర్, మీ మొబైల్ నంబర్లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- వెంటనే మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే చాలు.
- మీ ఆధార్-రేషన్ కార్డుల అనుసంధానం పూర్తి అవుతుంది. అంతే సింపుల్!