Aadhaar Card Free Update Deadline :ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్. వినియోగదారులు తమ ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకొనేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. 2024 డిసెంబర్ 14తో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉండగా, తాజాగా ఆ గడువును 2025 జూన్ 14 వరకు పొడిగించింది. కనుక మరో 6 నెలలలోగా ఆధార్ వినియోగదారులు తమ ఆధార్‌ను ఫ్రీగా అప్డేట్ చేసుకునే వీలు ఏర్పడింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడం వల్లనే గడువు పెంచాలని నిర్ణయించినట్లు యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే, తరువాత ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకునేందుకు తప్పకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కావాల్సిన పత్రాలివే!
ఆధార్ అప్డేట్ కోసం కచ్చితంగా మీ డెమోగ్రఫిక్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కావాల్సిన పత్రాలు ఏమిటంటే?
- మీ లేటెస్ట్ గుర్తింపు కార్డు
- చిరునామా
నోట్ :
- రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు.
- టీసీ, మార్క్‌షీట్, పాన్/ఈ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయి.
- విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (3 నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చు.
- ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను 'మై ఆధార్' వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్డేట్ చేసుండిలా!
- స్టెప్ 1:ఆధార్ కార్డును అప్డేట్ చేసేందుకు మొదట ఉడాయ్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/portal ఓపెన్ చేయండి.
- స్టెప్ 2:లాగిన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' ఆప్షన్‌పై నొక్కండి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- స్టెప్ 3:తరువాత 'డాక్యుమెంట్ అప్డేట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4:సూచనలను (గైడ్‌లైన్స్) చదివిన తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 5: అక్కడ మీ ఆధార్ వివరాలు అన్నీ కనిపిస్తాయి. మీ వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్ చేసుకుని, 'I Verify Above Details are Correct' అనే బాక్స్‌పై క్లిక్ చేసి నెక్ట్స్ ఆప్షన్‌కు వెళ్లండి.
- స్టెప్ 6: ఇప్పుడు మీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 7: వెంటనే మీ మెయిల్ అడ్రస్‌కు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) వస్తుంది. దీనిని ఉపయోగించి మీ ఆధార్ అప్డేట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. అంతే సింపుల్!
ఇలా చాలా సులువుగా మీ ఇంట్లోనే ఉండి ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకుకోవచ్చు. అప్డేట్ చేసిన ఏడు రోజుల (వర్కింగ్ డేస్) తర్వాత అప్డేట్ అయిన కొత్త ఆధార్ కార్డు మీకు లభిస్తుంది.