Loan Against Property Mistakes : చాలా మందికి స్థిరాస్తులు ఉంటాయి. కానీ అనేక ముఖ్యమైన ఖర్చులు, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి వారి దగ్గర సరిపడా నిధులు ఉండకపోవచ్చు. వీరు వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం ఆస్తిపై రుణం తీసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహా ఖర్చులు, వైద్యం, వ్యాపార విస్తరణ కోసం నిధులు అవసరమవుతాయి. ఇలాంటప్పుడు వారి దగ్గరున్న స్థిరాస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు కూడా తనఖాగా ఆస్తి ఉంటుంది కాబట్టి, తక్కువ వడ్డీ రేటుకే వేగంగా రుణాలు మంజూరు చేస్తాయి.
రుణగ్రహీత తన గృహం, దుకాణం, కార్యాలయం, వర్క్ షాప్ , ఫ్యాక్టరీ, నివాస, వాణిజ్య సముదాయాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆస్తిపై లోన్‌ను తీసుకోవచ్చు. ఆస్తిపై లోన్ అనేది సురక్షిత రుణం. ఇలా ఆస్తిపై రుణం తీసుకునేటప్పుడు చేయకూడని 5 తప్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వడ్డీ రేట్లు
ఆస్తిపై రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను పరిశీలించాలి. ఆస్తిపై లోన్ అనేది సురక్షిత రుణం. బ్యాంకుల వద్ద మీ ఆస్తి తనఖా ఉంటుంది కాబట్టి వడ్డీ రేటు వ్యక్తిగత రుణాల కన్నా తక్కువే ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కువ ఉండే బ్యాంకు వద్ద లోన్ తీసుకుంటే ఆ ప్రభావం లోన్ వ్యవధిలో మీరు తిరిగి చెల్లించే మొత్తంపై పడుతుంది. అలాగే ఈఎంఐ భారం కూడా పెరిగిపోతుంది. అందుకు పలు బ్యాంకుల్లో ఆస్తిపై లోన్ వడ్డీ రేట్లను పరిశీలించి, రుణం తీసుకోవడం మంచిది.
లోన్ అమౌంట్
ఆస్తిపై లోన్‌ను తీసుకునేటప్పుడు మరొక కీలక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు అవసరమైనంత రుణం మాత్రమే తీసుకోవాలి. లేదంటే మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అవసరమైన దానికంటే పెద్దమొత్తంలో లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించేటప్పుడు ఇబ్బందులు పడతారు. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీస్తుంది. మీ ఆర్థిక స్తోమతకు మించిన మొత్తంలో లోన్ తీసుకోకపోవడం ఉత్తమం. ఆస్తిపై రుణం తీసుకున్నప్పుడు చెల్లింపుల్లో ఆలస్యమయితే, బ్యాంకు పెనాల్టీ విధిస్తుంది. అలాగే లోన్‌పై డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి కారణాల వల్ల రుణగ్రహీత క్రెడిట్ స్కోరు కూడా ప్రభావితమవుతుంది. దీంతో భవిష్యత్తులో లోన్లు మంజూరు అవ్వడం కష్టమవుతుంది.