Youngest Child To Climb Mount Everest :ఎవరెస్టు- ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం. ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే బలంగా ఉండాలి. అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు ప్రతికూల పరిస్థితులు, ఇలాంటి పరిస్థితిలో పెద్ద పెద్దవారే ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు జంకుతుంటారు. అలాంటిది ఓ రెండున్నరేళ్ల సిద్ధి మిశ్ర అనే చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుంది. భారతదేశంలో అతిపిన్న వయస్సులోనే ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపుపైకి ఎక్కిన చిన్నారిగా పేరు తెచ్చుకుంది. బుడిబుడి అడుగులు వేస్తూ ఎవరెస్టును అధిరోహించిన ఆ చిన్నారి సాహసాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
10 రోజుల్లో 53కి.మీలు!
సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తున భారత పతాకాన్ని ఎగురవేసింది. ఎక్స్ పెడిషన్ హిమాలయ కంపెనీ ఎండీ నబీన్ త్రితాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చిన్నారి తన తండ్రి మహీం మిశ్రతోపాటు 2019లో విజయవంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తల్లి భావనా దేహరియాలతో కలిసి మార్చి 22న సిద్ధి మిశ్ర ఈ ఘనతను సాధించింది. ఎవరెస్టు ఈశాన్య ప్రాంతంలో ఉన్న నేపాల్లోని లక్లా నుంచి మార్చి 12న పర్వతారోహణను మొదలుపెట్టిన ఈ కుటుంబం 10 రోజుల్లో 53 కి.మీల దూరాన్ని పూర్తి చేసి తామనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. తమ కుమార్తెతో కలిసి ఎవరెస్టును అధిరోహించడంపై భావన సంతోషం వ్యక్తి చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి ఈ విజయాన్ని అనుసంధానం చేశారు.