తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అతి విశ్వాసమే బీజేపీకి పెద్ద దెబ్బ!' లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై యోగి ఆదిత్యనాథ్‌ - Lok Sabha Election 2024 Results - LOK SABHA ELECTION 2024 RESULTS

Yogi Adityanath On Lok Sabha Results : ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయంపై అతి విశ్వాసం పెట్టుకోవడం బీజేపీ ఆశలను దెబ్బ తీసిందని అన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే కాషాయ పార్టీ పొందగలిగిందని తెలిపారు.

Yogi Adityanath
Yogi Adityanath (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 6:56 AM IST

Updated : Jul 15, 2024, 7:03 AM IST

Yogi Adityanath On Lok Sabha Results : లోక్​సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఫలితాలపై ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశలను దెబ్బ తీసిందన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందని చెప్పారు. లఖ్​నవూలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

గణనీయమైన మార్పు వచ్చినా!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సమర్థవంతంగా పని చేసిందని యోగి తెలిపారు. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల (కేంద్ర, రాష్ట్రాల్లో జరిగిన ఆయా ఎన్నికలు) వరకు ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, అదే ఓట్ల శాతంతో 2024లో మరోసారి విజయం సాధించిందని వెల్లడించారు. కానీ ఈ సారి గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొన్నారు.

గెలుపుపై అతి విశ్వాసమే!
మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బీజేపీ పొందినప్పటికీ విపక్షాలకు ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణమైందనడంలో సందేహం లేదని యోగి పేర్కొన్నారు. అయితే యూపీలో శాంతి భద్రతలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు హింసను సృష్టించాలని చూసినా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఆ వ్యూహాలను తిప్పికొట్టిందన్నారు.

కాగా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఇటీవల ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 10 సీట్లను గెలుచుకుంది. బీజేపీ మాత్రం రెండు స్థానాలకే పరిమితమైంది. మరో చోట స్వతంత్ర పార్టీ అభ్యర్థి గెలుపొందారు. గతంలో ఈ 13 స్థానాల్లో ఇండియా కూటమికి ఆరు, బీజేపీకి ఐదు, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కోచోట చొప్పున ప్రాతినిధ్యం ఉండేది. ఉప ఎన్నికల ఫలితాలు దేశంలో మారిన రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే. ఈ ఫలితాల అనంతరం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Last Updated : Jul 15, 2024, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details