తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా కుంభమేళాకు సర్వం సిద్ధం- తరలిరానున్న 35 కోట్ల మంది భక్తులు! - MAHA KUMBH MELA 2025

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాకు సర్వం సిద్ధం- హాజరుకానున్న కోట్లాది మంది భక్తులు- తాత్కాలిక నగరం మహా కుంభ్‌నగర్‌లో అన్ని ఏర్పాట్లు- తొలి షాహీ స్నాన్‌ కోసం తరలివచ్చిన లక్షలాది మంది

Maha Kumbh Mela 2025
Maha Kumbh Mela 2025 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 10:28 PM IST

Maha Kumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభ మేళాకు సమయం ఆసన్నమైంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఆ ఆధ్యాత్మిక వేడుక ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నుంచి మొదలుకానుంది. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఇది. సోమవారం పుష్య పౌర్ణమి రోజు తొలి షాహీ స్నాన్‌ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు.

35 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
గంగ, యమునలతోపాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో సాగే ఈ మహా కుంభమేళా భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈసారి మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా కుంభమేళాకు రెండు రోజుల ముందు శనివారం రోజు 25 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం కూడా లక్షలాది మందితో ఘాట్లన్నీ కిటకిటలాడాయి.

10 వేల ఎకరాల పరిధిలో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు
మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌ రాజ్‌ను అందంగా తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రయాగ్‌ రాజ్‌కు చేరుకున్నారు. 10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు.

సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యత
1,250 కిలోమీటర్ల పైపులైన్లతో 50 వేల నీటి కనెక్షన్లు ఇచ్చారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను, 30 బల్లకట్టు వంతెనలను నిర్మించారు. పారిశుద్ధ్య నిర్వహణకు 15 వేల మంది శానిటేషన్‌ సిబ్బందిని నియమించారు. వారి పిల్లల కోసం స్మార్ట్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధ సహా అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నారు. మహా కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని ఇది సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ఇది నిదర్శనమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

45 వేల మంది పోలీసు సిబ్బంది మోహరింపు
మహా కుంభ్‌నగర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది. ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. భక్తుల భద్రతకు యూపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పటిష్ఠ నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. 55 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామాజిక మాధ్యమాలపై కూడా నిరంతరం నిఘా ఉంచనున్నారు.

భారీ గేట్లు ఏర్పాటు
56 మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను మోహరించారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్‌ సెంటర్‌తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న వివిధ కార్యాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలను వేశారు. రద్దీ నిర్వహణ కోసం వివిధ క్రాస్‌రోడ్స్‌, ట్రై జంక్షన్స్‌ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారాల వద్ద భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి కుంభమేళా కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

13వేల రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ
జనవరి 13న పుష్యపౌర్ణమి, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 3వేల ప్రత్యేక రైళ్లతోపాటు మొత్తంగా 13 వేల రైళ్లను నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 9 కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details