World Smallest Cow: ప్రపంచంలోనే అతి చిన్న ఆవును రెండున్నర లక్షలకు కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. పుంగనూర్ జాతి ఆవులుగా పిలిచే వీటి ఎత్తు కేవలం రెండున్నర అడుగులు మాత్రమే. పొట్టిగా ఉండటమే కాకుండా ఈ ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ జాతి ఆవు పాలను బంగారు పాలు అని అంటారు. అలానే వీటిని ఇంట్లో పెట్టుకోవటం కూడా వాస్తు ప్రకారం మంచిదని భావిస్తారు. అందుకే ఈ జాతి ఆవులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
రూ.2 లక్షలకు కొనుగోలు
మధ్యప్రదేశ్లో పందుర్ణాలోని కచ్చిధానా గ్రామానికి చెందిన సంజీవ్ ఖండేల్వాల్ ఈ జాతి ఆవులను రూ. 2,80 లక్షలకు కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నుంచి ఒక జత పుంగనూరు జాతి ఆవులు, ఒక ఎద్దును కొన్నారు. ఈ జాతి ఆవులను చూసేందుకు సంజీవ్ ఇంటికి ప్రతిరోజూ ప్రజలు వస్తున్నారు. ఈ జాతి ఆవులను ఇంటిలో కుక్కపిల్లలుగా పెంచుకోవచ్చని సంజీవ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆవులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయని చెప్పారు. మొదట్లో అరలీటర్ పాలు మాత్రమే ఇచ్చేవని, ఇప్పుడు రోజుకు ఒకటిన్నర నుంచి 2లీటర్ల వరకు ఇస్తున్నాయని సంజీవ్ తెలిపారు.
ఆరోగ్యానికి మేలు
ఈ ఆవు పాలల్లో అనేక ఔషధాలు ఉన్నాయని అంటున్నారు పశువైద్యుడు డాక్టర్ సురేంద్ర చౌక్సే. 'వీటి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో 8 శాతం వరకు వెన్న ఉంటుంది. అయితే సాధారణ ఆవుల్లో ఇది మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే ఉంటుంది. ఈ ఆవు మూత్రాన్ని కూడా ఎక్కువగా విక్రయిస్తుంటారు. దీని మూత్రంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల రైతులు తమ పొలాల్లో పురుగుమందులుగా ఉపయోగిస్తారు' అని సురేంద్ర తెలిపారు.