Women Married Many Men in Tamil Nadu : తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చెసుకుని ఆపై నగలు, డబ్బులతో ఉడాయించింది. ఇలా ఇప్పటివరకు 12మందిని మోసం చేసింది. ఇటీవల మరో వ్యక్తిని కూడా మోసం చేసేందుకు ప్రయత్నించింది. కానీ అతడికి అనుమానం రావడం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ నిత్య పెళ్లి కూతురి అసలు బండారం బయట పడింది. పరారైన ఆ మహిళను సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.
అసలేం జరిగిదంటే!
తిరుప్పూర్ జిల్లా తారాపురానికి చెందిన మహేశ్ అరవింద్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కోసం వెతికారు. ఈ క్రమంలో గతేడాది మొదట్లో మ్యాట్రిమోని ద్వారా ఈరోడ్ జిల్లా కొడుముడికి చెందిన సత్య(30) అనే మహిళ మహేశ్ అరవింద్‌కు పరిచయమైంది. ఆ తర్వాత అమ్మకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని, తనను వివాహం చేసుకోవాలని మహేశ్‌పై ఒత్తిడి చేసింది. దీంతో గతేడాది జూన్‌లో పళనిలోని ఓ ఆలయంలో సత్యను వివాహం చేసుకున్నాడు మహేశ్. అతడి తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. వారు సత్యకు కానుకగా 12 సవర్ల నగలు ఇచ్చారు.
ఆధార్ కార్డుతో అసలు విషయం
పెళ్లి తర్వాత మూడు నెలలు అంతా హ్యాపీగానే గడిచింది. ఆ తర్వాత సత్య ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు గమనించాడు మహేశ్. ఆమెపై అనుమానం వచ్చి ఆధార్ కార్డును చెక్ చేశాడు. దానిపై భర్త పేరుగా చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉంది. వయసు కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురైన మహేశ్, సత్యను నిలదీశాడు. దీంతో మహేశ్‌తో గొడవ పెట్టుకుని అతడి కుటుంబ సభ్యులను బెదిరించింది సత్య. మోసపోయానని గ్రహించిన మహేశ్, వెంటనే తారాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న సత్య, గత వారమే తారాపురం నుంచి పరారైంది. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదివారం పుదుచ్చేరిలో ఉన్న సత్యను అరెస్ట్ చేశారు.