IMA Study On Doctors :కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మూడింట ఒకవంతు మహిళా వైద్యులు రాత్రివేళల్లో పనిచేయడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్- IMA సర్వేలో వెల్లడైంది. దాదాపు 3885 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేల్లో దాదాపు 35 శాతం మంది వైద్యులు రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. బాధితురాలు విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి జరగడం వైద్యుల్లో తీవ్ర అలజడి రేపింది.
దీంతో నైట్ షిఫ్ట్‌లు చేయడానికి వైద్యులు భయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రధానంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆత్మరక్షణ కోసం విధులకు వచ్చేటప్పుడు ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని భావిస్తున్నారని IMA వెల్లడించింది. నైట్ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని సర్వేలో పాల్గొన్న 24.1 శాతం మంది వైద్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. మరో 11.4 శాతంమంది వైద్యులు అత్యంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. భయపడుతున్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు,వైద్య విద్యార్థినులే ఉన్నట్లు వివరించింది.
నైట్‌షిఫ్టుల్లో డ్యూటీ రూమ్‌లు లేవని 45శాతం మంది పేర్కొన్నారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నచోట అవి సరిపోవడం లేదని, గోప్యత లేకపోవడం, తాళాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పింది. అందుబాటులో ఉన్న మూడింట ఒకవంతు డ్యూటీ రూమ్‌లలో అటాచ్డ్ బాత్‌రూమ్‌లు లేవని సర్వేలో తేలింది. వాటికోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.