Baramati Pawar Vs Pawar :మహారాష్ట్రలోని బారామతిలో ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్‌పీ) అభ్యర్థులుగా అజిత్ పవార్, యుగేంద్ర పవార్ బరిలోకి దిగుతుండటం వల్ల ఆ నియోజకవర్గ పోరుపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతిలో పవార్ కుటుంబం పోటీపడగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప'వార్'కు ఆ సీటు వేదికగా మారినట్లయింది.
పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నుంచి సీనియర్ నేత శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ కొన్ని దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు కొనసాగారు. ఆ తర్వాత (1991 ఉప ఎన్నిక) నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలుస్తూ వస్తున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా పవార్‌ల రాజకీయ ప్రస్థానానికి వేదికగా నిలుస్తున్న బారామతి, ఇటీవల పవార్ కుటుంబ సభ్యుల మధ్యే పోటీకి వేదికగా నిలిచే పరిస్థితి ఏర్పడింది.
సునేత్ర Vs సుప్రియ
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్, శివసేన, భాజపా సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంలో కలిసిపోయారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ను బరిలోకి దింపారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని చెప్పడం గమనార్హం.
కానీ మళ్లీ ఇప్పుడు!
అయితే తమ కుటుంబంలో రాజకీయ వ్యవహారాల గురించి అజిత్ పవార్ మాట్లాడిన తీరును చూస్తే శరద్ పవార్‌పై కొంత సానుకూలత వ్యక్తం చేశారనే అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. దీంతో బారామతి అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పోటీ చేయకపోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. కానీ తాను ఇదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు అజిత్ ప్రకటించారు. మరోవైపు శరద్ పవార్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) నుంచి యుగేంద్ర పవార్ బరిలోకి దించుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అజిత్ పవార్ సోదరుడైన శ్రీనివాస్ కుమారుడే యుగేంద్ర పవార్. ఎన్సీపీ-ఎస్పీ నుంచి యుగేంద్ర అభ్యర్థిత్వం ఖరారు కావడం వల్ల బారామతి మరోసారి ప'వార్'కు వేదికైంది.