తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిప్యూటీగా ఏక్​నాథ్ శిందే - సీఎంగా ఫడణవీస్‌ - బీజేపీ వ్యూహం ఇదేనా! - WHO IS THE NEXT CM OF MAHARASHTRA

ఏక్​నాథ్ శిందేకు ఉపముఖ్యమంత్రి పదవి! - ఒప్పుకుంటారా?

eknath shinde Vs devendra fadnavis
eknath shinde Vs devendra fadnavis (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 7:50 PM IST

Next CM Of Maharashtra :మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం వల్ల ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో బీజేపీ నుంచి దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిందే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్‌ శిందేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివసేనతో బీజేపీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సమాచారం.

శిందే పరిస్థితి ఏమిటి?
మహారాష్ట్రలో త్వరలో ఏర్పాటు కానున్న నూతన మహాయుతి ప్రభుత్వంలో ఏక్‌నాథ్‌ శిందే ఏ పాత్ర పోషిస్తారు? ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఆలోపు మహాయుతి కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండు రోజులే సమయం ఉండటం వల్ల ఎవరికి ఏ పదవులు దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధికంగా 132 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీనే గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. శనివారం నాగ్‌పుర్‌ నుంచి ముంబయి చేరుకున్న దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్‌నాధ్‌ శిందే, అజిత్ పవార్‌తో చర్చించారు. కేబినెట్‌ బెర్తులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

పాత ఫార్ములా పనిచేస్తుందా?
గతంలో మాదిరే మహాయుతి కూటమి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి ఏక్‌నాథ్‌ శిందేకు డిప్యూటీ సీఎం కట్టబెట్టి, దానితోపాటు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల శాఖ వంటి కీలక శాఖలు అప్పగిస్తారని తెలిసింది. తద్వారా ఫడణవీస్‌ కేబినెట్‌లో రెండో సారి శిందే సేవలు అందించనున్నారు. ఫడణవీస్ హయాంలో ఆయన హోంమంత్రి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమం, పట్టణాభివృద్ధి తదితర శాఖలు నిర్వహించారు. గతంలో శిందే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు తెలిపినప్పుడు, ఫడణవీస్ వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు. ఇప్పుడు శిందే కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తారా? లేదా? అనేది చూడాలి.

శిందే ముఖ్యమంత్రి కావాలి?
శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్​నాథ్​ శిందేను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు. శిందేకు ఉన్న క్లీన్ ఇమేజ్, హరియాణా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకి చేసిన సాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. శిందేపై విశ్వాసం ఉంచి 5 ఏళ్లు సీఎం పదవిని కట్టబెట్టాలని కోరుతున్నారు. సీఎంగా పనిచేసిన కాలంలో శిందే ప్రజాదారణ పొందారు. మౌలిక సదుపాయల కల్పనలో మంచి పనితీరు కనబర్చిన శిందే, మహాయుతి గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.

ఆ విషయంలో శిందేకు పూర్తి అధికారం
శివసేన శిందే వర్గం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు శిందేకు పూర్తి అధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం చేసింది. శాసనసభాపక్ష నేత, విప్‌లు, ఆఫీస్ బేరర్ల నియమాకాన్ని శిందేకు కట్టబెట్టింది. అటు అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి దక్కాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details