Manmohan Singhs Daughters Achievements :మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక గొప్ప ఆర్థికవేత్త, అపర మేధావి, ఆర్థిక సంస్కర్తగా అందరికీ తెలుసు. నిరాడంబరంగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 'నేను మసకగా ఉన్న కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్నాను. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం నా చదువే' అని గతంలో ఓ సందర్భంలో చెప్పారు మన్మోహన్. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం ప్రస్తావన వస్తే అందులో ముఖ్యంగా చర్చించుకునేది ఆయన చదువు గురించే. విద్య పట్ల మన్మోహన్ సింగ్కు ఉన్న శ్రద్ధ ఆయన పిల్లల విజయాల్లో కనిపిస్తుంది. మన్మోహన్ ముగ్గురు కుమార్తెలు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దామన్ సింగ్ తండ్రి బాటల్లోనే నడిచారు. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకుని వారి కెరీర్లలో అద్భుత విజయాలు సాధించారు. అనేక మైలురాళ్లు దాటారు. వీరు సాధించిన విజయాలు ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉపిందర్ సింగ్
ఉపిందర్ సింగ్ ఒక చరిత్రకారిణి. అశోక విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఉపిందర్ సింగ్ దిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం అధిపతిగా పనిచేశారు. ఆమె దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, మాంట్రియాల్లోని మెక్గిల్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్, లైడెన్ యూనివర్సిటీల్లో ఉపిందర్ సింగ్కు ఫెలోషిప్‌లు ఉన్నాయి. 2009లో ఆమెకు సోషల్ సైన్సెస్ విభాగంలో ఇన్ఫోసిస్ బహుమతి లభించింది.
ఉపిందర్ సింగ్ ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, రాజకీయ సిద్ధాంతాలపై చాలా పరిశోధనలు చేశారు. అంతేకాకుండా భారతదేశ చరిత్ర, రాజకీయాల గురించి అనేక పుస్తకాలు రచించారు. ఉపిందర్ సింగ్ రాసిన పుస్తకాలలో "ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా", "పొలిటికల్ వాయ్లెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా" వంటివి పుస్తకాలు ప్రశంసలు పొందాయి.