తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలాంటి ప్రసంగాలతో PMO హుందాతనాన్ని తగ్గించిన మోదీ'- 2024 ఎన్నికల్లో మన్మోహన్ ఫైర్​ - MANMOHAN SINGH ON MODI

వీల్​ఛైర్​కు పరిమితమైన తగ్గని మన్మోహన్ సింగ్- 2024 లోక్​సభ ఎన్నికల సమయంలో మోదీ, బీజేపీపై విమర్శనాస్త్రాలు!

Manmohan Singh On Modi
Manmohan Singh On Modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2024, 9:25 AM IST

Manmohan Singh On Modi : 2024లో జరిగిన లోక్​సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనారోగ్యంతో వీల్​ఛైర్​కు పరిమితమైనా కేంద్రంపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని ప్రధాని మోదీ తగ్గించారని ధ్వజమెత్తారు. లోక్​సభ తుదిదశ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పంజాబ్‌ ఓటర్లకు మన్మోహన్‌ సింగ్‌ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో మోదీపై విమర్శలు గుప్పించారు.

'బీజేపీ బూటకపు జాతీయవాదం'
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిదాయకమైన ఉజ్వల భవిష్యత్తుకు కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే భరోసా ఇవ్వగలదని మన్మోహన్ సింగ్ తెలిపారు. యువతలో దేశభక్తి, సాహసం, సేవా నిరతి నాలుగేళ్లు మాత్రమే ఉంటాయని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. ఇది బీజేపీ బూటకపు జాతీయవాదానికి నిదర్శనమని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్‌ పథకాన్ని దుయ్యబట్టారు. రెగ్యులర్ రిక్రూట్​మెంట్ కోసం శిక్షణ పొందిన యువత అవుట్‌ గోయింగ్ పాలన వల్ల మోసపోయారని ఆరోపించారు.

'ఆ కాపీరైట్ బీజేపీదే'
"సాయుధ బలగాల ద్వారా మాతృభూమికి సేవ చేయాలని పంజాబ్ రైతు బిడ్డలు కలలు కన్నారు. ఇప్పుడు కేవలం 4 సంవత్సరాల కాలానికే రిక్రూట్​మెంట్ అని తెలిసి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అగ్నివీర్ పథకం దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తుంది. అందుకే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగాలన్నీ విభజన, విద్వేష స్వభావం కలిగినవే. బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని, ప్రధాన మంత్రి కార్యాలయం హుందాతనాన్ని దిగజార్చారు. ఓ వర్గాన్ని కానీ, విపక్షాలను కానీ లక్ష్యంగా చేసుకొని గతంలో ఏ ప్రధాని కూడా ఇటువంటి ప్రసంగాలు చేయలేదు. నాకూ కొన్ని తప్పుడు ప్రకటనలను ఆపాదించారు. విభజన దృష్టితో చూసే కాపీ రైట్‌ బీజేపీకే సొంతం" అని మన్మోహన్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.

'రైతులపై విమర్శలు చేసిన ప్రధాని'
గత పదేళ్లలో పంజాబీలను దూషించడం కోసం బీజేపీ సర్కార్ ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదని మన్మోహన్ ఆరోపించారు. దిల్లీ సరిహద్దులో కొన్ని నెలలపాటు ఆందోళన చేపట్టిన పంజాబ్​కు చెందిన 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లు చాలవు అన్నట్లుగా ఏకంగా ప్రధాని మోదీ వారిపై మాటల దాడికి దిగడం విచారకరమన్నారు. రైతులను సంప్రదించకుండానే మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేశారని పేర్కొన్నారు.

"ఉజ్వల భవిష్యత్తు కోసం జాగ్రత్త వహించి ఓటు వేయాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి ఆధారిత ప్రగతిశీల భవిష్యత్తును అందిస్తుంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది. దేశ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. డీమానిటైజేషన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పంజాబీలు యోధులు. వారు త్యాగ స్ఫూర్తికి, అలుపెరగని ధైర్యానికి ప్రసిద్ది చెందారు."
-- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

'వందేళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం'
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వందేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. యూపీఏ హయాంలో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచామని తెలిపారు. గడిచిన పదేళ్ల బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యిందని ఆరోపించారు. కాగా, మన్మోహన్ సింగ్‌ (92) గురువారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీలోని ఎయిమ్స్‌ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ABOUT THE AUTHOR

...view details