What Is CAA Law In India :పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)- ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. మరి అసలు సీఏఏ అంటే ఏంటి? అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి?
పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి?
పౌరసత్వ సవరణ బిల్లు-సీఏబీని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారతదేశ పౌరసత్వం కల్పించడమే సీఏబీ ముఖ్య ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచ్చినవారు ఇందుకు అర్హులు. ఈ అర్హత కేవలం హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్శీలు, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. వీరంతా ఎలాంటి ధ్రువీకరణ పత్రాల్లేకున్నా పౌరసత్వం కోసం దాఖలు చేసుకోవచ్చు.
ఎన్నికలకు ముందే ఎలా అయినా!
ఆయా దేశాల్లో నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం దక్కనుంది. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అయితే 2019 డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏ ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ ఇంతవరకు కూడా దీనిపై నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
నిరసనలకు కారణం ఇదే
అయితే పౌరసత్వ సవరణ చట్టం పరిధిలో ముస్లింలను చేర్చకుండా ముస్లిమేతరలను ప్రస్తావించడం వల్ల అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత 2019 డిసెంబర్ 4వ తేదీన అసోంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 2019 డిసెంబర్ 11వ తేదీన ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రదర్శనలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో హింస కూడా చెలరేగింది. ఆ సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.