CV Ananda Bose Statue at Raj Bhavan : బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ విగ్రహాన్నిరాజ్భవన్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆనంద్ బోస్ పదవీకాలం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహన్ని ప్రతిష్ఠించారు. శనివారం ఉదయం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు.
గవర్నర్ విగ్రహాన్ని ఇండియన్ మ్యూజియం కళాకారుడు పార్థ సాహా వారం రోజుల్లో తయారు చేశారు. దీనిని శనివారం ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభించారు. ఆ తర్వాత లాంఛనప్రాయంగా విగ్రహాన్ని గవర్నర్ ఆనంద్ బోస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం పోటీలు కూడా నిర్వహించారు.
ఆహ్వానితుల జాబితాలో లేని సీఎం పేరు
ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాజ్‌భవన్ నుంచి దాదాపు 200 మందికి ఆహ్వానాలు పంపారు. అయితే ఆ జాబితాలో ముఖ్యమంత్రి పేరు లేదని రాజ్‌భవన్‌కు సంబంధించిన అధికారిక వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా ఏ రాజకీయ నేతకూ ఆహ్వానాలు పంపలేదని పేర్కొన్నాయి. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాయి.
స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన సీవీ ఆనందర్ బోస్ (ETV Bharat) ఇది రాష్ట్రానికే దౌర్భగ్యం
మరోవైపు రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం ప్రతిష్ఠించడంపై రాజకీయంగా చర్చ మొదలైంది. ఒక వ్యక్తి జీవించి ఉండగా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ఇది సిగ్గుచేటు విషయమని, బంగాల్ సంస్కృతితో ఆటలాడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సౌమ్య రాయ్ అన్నారు. ఇది అవమానకరమైన విషయమని విమర్శించారు. ఆయన ప్రతినిధిగా గవర్నర్‌ను పంపిన ప్రధానమంత్రే తన పేరును స్టేడియంకు పెట్టుకున్నారని, ఇంకా చెప్పేది ఏముంటుందని అన్నారు. రాజ్‌భవన్‌లో విగ్రహం పెట్టడం మన రాష్ట్రానికే దౌర్భాగ్యమని సీపీఎం కేంద్ర కమీటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి అన్నారు.