Aparajita Bill West Bengal :అత్యాచార దోషులకు జీవితఖైదు విధించే యాంటీ-రేప్ బిల్లుకు బంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు-2024 పేరుతో తీసుకొచ్చిన బిల్లును ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మోలాయ్ గాటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి, మహిళలు, పిల్లల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా బంగాల్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. పెరోల్ లేకుండా దోషులకు జీవితకాల కారాగార శిక్ష విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.
అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లు చారిత్రకమని వ్యాఖ్యానించారు. "ఈ రోజు మేం ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలి. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది. ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సత్వర విచారణ, బాధితులకు న్యాయం అందించడం ఈ బిల్లు లక్ష్యం. ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే ప్రత్యేక అపరాజిత టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తాం" అని తెలిపారు మమత.
"అత్యాచారం వంటి చర్యలు మానవాళికి ఒక శాపాలు. అలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాలి. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. ఉన్నావ్, హాథ్రస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బంగాల్లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుంది. మీలా నేనూ ప్రధాని, హోంమంత్రిపై నినాదాలు చేస్తే ఎలా ఉంటుంది? మహిళ రక్షణ కోసం సమర్థమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు మమత.