Wayanad Landslide Death Toll : భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించడం వల్ల కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 287చేరింది. ఇంకా 240 మంది ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలి నుంచి ప్రజలను రక్షించేందకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలు నిర్మించారు. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ గురువారం పర్యటించనున్నారు.
వందల మందిని కాపాడుతున్న బెయిలీ వంతెనలు
ఇదిలా ఉండగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు బెయిలీ అనే తాత్కాలిక వంతెనలను నిర్మించారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావాల్సిన పరికరాలను దిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు. వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తరలించవచ్చు. వాటిని ఉపయోగించడానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు. ప్రకృతి విపత్తు సమయంలో తాత్కాలిక నడక మార్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక ఆర్మీ బృందం ఈ వంతెనల నిర్మాణం చేపట్టిందని కేరళ మంత్రి కె రాజన్ మీడియాకు వెల్లడించారు.
తమ రాష్ట్రంలో ఇటువంటి విషాదాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 'మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో తాత్కాలిక వంతెనను శుక్రవారం నాటికి పూర్తి చేస్తాం. రెండు రోజుల సహాయక చర్యల్లో 1,592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 219 మందిని ఆసుపత్రుల్లో చేర్చాం. వారిలో 78 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించాం". అని ముఖ్యమంత్రి తెలిపారు. గురువారం వయనాడ్‌లో సీఎం అధ్యక్షతన అఖిల సమావేశం జరగనుందని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయక శిబిరాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పర్యటించనున్నారని ఒక ప్రకటను విడుదల చేసింది.