Female Train Drivers Urinals Issue :ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారు. అయినప్పటికీ వాళ్లకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదరువుతున్నాయి. వాటిలో ప్రధానమైనది కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరైన వసతులు లేకపోవడం. అయితే ఇండియన్ రైల్వేస్‌లో పనిచేసే మహిళా లోకో పైలట్ల (ట్రైన్ డ్రైవర్లు) పరిస్థితి ఘోరంగా ఉంది. మహిళా లోకో పైలెట్‌లు మూత్రశాలకు వెళ్లాలన్నా, ఆ విషయాన్ని వాకీటాకీలో తమ సహచర పురుష లోకో పైలెట్‌కు చెప్పి వెళ్లాల్సి ఉంటుంది. ఇది వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తోంది! అందుకే ఈ విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ఇదేం నిబంధన?
రైల్వే మహిళా ఉద్యోగులు మూత్రశాలకు వెళ్లాలంటే, వారు ఆ విషయాన్ని వాకీటాకీలో రైల్వే సిబ్బందికి తెలియజేయాలి. ఇలా చెప్పడాన్ని మహిళా డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "మేము మూత్రశాలలకు వెళ్లడానికి అనుమతి తీసుకోవాలి. ఆ విషయాన్ని స్టేషన్ మాస్టర్‌కు తెలియజేయాలి. పురుష లోకో పైలట్‌కు కూడా చెప్పాలి. అప్పుడు పురుష లోకో పైలెట్ ఆ విషయాన్ని మేనేజర్‌కు తెలియజేస్తాడు. ఆ మేనేజర్ కూడా పురుషుడే అయ్యుంటాడు. ఇది మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది" అని ఒక మహిళ లోకోపైలెట్ ఆవేదన వ్యక్తం చేశారు.
"మూత్రశాలకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవడానికి వాకీటాకీలు ఉపయోగిస్తాం. ఈ వాకీటాకీలు వాడడం వల్ల చాలా మందికి ఈ విషయం తెలుస్తుంది. ఒక మహిళా డ్రైవర్ వాష్‌రూమ్‌కు వెళ్లాలని కోరుతున్నారని రైల్వే స్టేషన్ అంతా మాట్లాడుకుంటారు" అని ఓ మహిళా లోకో పైలట్ వాపోయారు.
భద్రతకు ప్రమాదం
ఈ విధానం మహిళా లోకో పైలెట్ల భద్రతకు ప్రమాదకరంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, భారతీయ రైల్వేలో పనిచేస్తున్న 1700 మంది మహిళా రైలు డ్రైవర్లలో, 90 శాతం మంది అసిస్టెంట్ లోకో పైలట్‌లు ఉన్నారు. వీరిలో చాలా మంది పురుష లోకో పైలట్‌లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. ఈ విషయంపై మరో మహిళా లోకో పైలట్ మాట్లాడుతూ, "నేను ఒకసారి సరుకు రవాణా రైలులో మగ డ్రైవర్‌తో కలిసి డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ప్యాసింజర్ రైలులో అయితే కోచ్‌లోనే వాష్‌రూమ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ రవాణా రైలులో వెళ్లినప్పుడు, స్టేషన్‌లో దిగి మూత్రశాలకు వెళ్లాల్సి ఉంటుంది. నేను అలా దిగినప్పుడు వాకీటాకీ సందేశాల ద్వారా ముందుగానే విషయం తెలుసుకున్న కొందరు అధికారులు నావైపు అదోలా చూశారు. ఇది నాకెంతో ఇబ్బందికరంగా అనిపించింది" అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
'గత రెండేళ్లలో వందలాది మంది కొత్త అమ్మాయిలు లోకో పైలెట్లుగా ఎంపికయ్యారు. కానీ వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా, అనుమతి తీసుకోవాల్సి వస్తుండడం వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటోంది' అని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అశోక్ శర్మ చెప్పారు. 'వాష్‌రూమ్ వెళ్లాల్సి వస్తుందన్న భయంతో చాలామంది నీరు తాగడం మానేస్తున్నారు. డ్యూటీ సమయంలో పూర్తిగా ద్రవ పదార్థాలను తీసుకోవడం లేదు. ఇది వారి ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతోంది' అని అశోక్‌శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా లోకో పైలెట్లు ఆహారం, వాష్‌రూమ్‌లకు వెళ్లే నిబంధనలు సరళతరం చేసేందుకు ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీ ఏం చేస్తుందో చూడాలి.
'2025 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్' - అమితాబ్ కాంత్ - Indian Economy By 2025
అలర్ట్ - త్వరలో కిలో వెండి ధర రూ.1లక్ష దాటే ఛాన్స్! - Silver Price Forecast