UPPSC Exam Protest: ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్(PCS), ఆర్‌ఓ/ఏఆర్‌ఓ ప్రాథమిక పరీక్షలను రెండు రోజులు కాకుండా ఒకే రోజులో నిర్వహించాలని విద్యార్థులు వరుసగా నాలుగో రోజూ నిరసనలు కొనసాగించారు. గురువారం ప్రయాగ్‌రాజ్‌లోని యూపీపీఎస్సీ కార్యాలయం వద్ద విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చి నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. కొంతమంది బారికేడ్లను దాటి లోపలికి వెళ్లి మరి నిరసనలు కొనసాగించారు.
ఉత్తర్‌ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 7, 8 తేదీల్లో పీసీఎసీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలను డిసెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలను ఒక రోజులో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే తమకు డిమాండ్ ఒక్కటే అని, దానిని నేరవేర్చడం కూడా సులభమని విద్యార్థులు అంటున్నారు. పరీక్షలను మునుపటి పద్ధతిలోనే నిర్వహించాలని, తమ డిమాండ్ నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు.
'చర్చలకు విద్యార్థులు సిద్ధంగా లేరు'
ప్రభుత్వ వ్యతిరేకత శక్తులు విద్యార్థులను రెచ్చగొట్టి ఈ నిరసనల్లో భాగమవుతున్నారని ప్రయాగ్‌రాజ్ డీసీపీ అభిషేక్ భారతి అన్నారు. అలాంటి వారిని గుర్తించి విచారిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ నిరసనను రాజ్యాంగబద్ధంగా కొనసాగించాలని కోరారు. బుధవారం ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తమ డిమాండ్ల గురించి చర్చించేందుకు విద్యార్థులు సిద్ధంగా లేరని ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ మందార్ తెలిపారు. వారితో మాట్లాడేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో పేపర్ లీక్‌లు జరిగినప్పుడు విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేసినట్టు యూపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ గుర్తు చేశారు. ఆ డిమాండ్ల ఆధారంగా కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించేలా కమిషన్ విధానాలు రూపొందించినట్ట తెలిపారు. PCS పరీక్షలకు మొత్తం 5 లక్షల 76 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో కేవలం 4 లక్షల 35 వేల మందికి సరిపడా ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు ఉన్నట్టు వివరించారు. అందుకే పరీక్షను రెండు రోజులు నిర్వహిస్తున్నట్టు అశోక్ కుమార్ చెప్పారు.