Unique Protest Of Saint Standing On One Leg :ప్రజాస్వామ్యానికి తల్లిగా భావించే మనం దేశంలో, ప్రజలు వారి సమస్యలు తీర్చమని నిరసనలు చేయడం కొత్తేమీ కాదు. చాలా మంది ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలతో తమ డిమాండ్లను పాలకుల ముందు ఉంచుతారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన ప్రాంతంలోని దయనీయ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వినూత్న రీతిలో తెలియజేస్తున్నాడు. మూడేళ్లుగా ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలుపుతున్నాడు.
ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా మండలం గ్వరాయి గ్రామానికి చెందిన బాబా మహేశానంద్ గిరి అలియాస్ బచ్చా బాబా, స్థానిక దేవాలయంలో ప్రధాన పూజారిగా పని చేస్తున్నాడు. తుండ్లా మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి సరైన రోడ్డు వసతి లేదు. విద్యుత్ కోతలు తదితర సమస్యలతో గ్వరాయి గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. తన ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసిన మహేశానంద్, సమస్యలకు పరిష్కారం చూపాలనుకున్నాడు. ఎలాగైనా వారి కష్టాలను పాలకులకు తెలియజేయాలనుకున్నాడు. అప్పటినుంచి ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. రోజంతా ఒంటికాలిపైనే నిలబడతాడు. నిద్రపోవడానికి కూడా కాలు కింద పెట్టడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇలా నిరసన తెలుపుతున్నాడు.
"ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఇలా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలుపుతున్నాను. నేను ఒంటికాలిపైనే నిలబడతా, అంతేకానీ ఎప్పుడూ రెండు కాళ్లపై నిటారుగా నిలబడను. మా చుట్టు పక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మా గ్రామంలో ఎందుకు జరగడం లేదు? మా ఊరిలో వీధి దీపాలు లేవు. రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయి." అని మహేశానంద్ వాపోయాడు.