Uttarakhand UCC :ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. యూసీసీ విధివిధానాలకు సంబంధించిన పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఆవిష్కరించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.
ఉమ్మడి పౌరస్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని సీఎం పుష్కర్‌సింగ్ ధామి వెల్లడించారు. ' ఈ రోజు ఉత్తరాఖండ్‌కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజు. ఇది మహిళలపై వివక్షను రూపుమాపుతుంది. చిన్నారుల హక్కులను కాపాడుతుంది. ఏ మతాన్నో లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురాలేదు. ఇది అన్ని దురాచారాలను రూపుమాపే చట్టబద్ధ ఆయుధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలను దీనినుంచి దూరంగా ఉంచాం. తద్వారా ఆ తెగలు వారి హక్కులను పరిరక్షించుకోవచ్చు' అని సీఎం ధామి తెలిపారు.
యూసీసీలోని కీలక అంశాలు!
- వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా యూసీసీ ఉంటుంది.
- మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది.
- సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో ఉన్నాయి.
- సహజీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు.
- సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.
- అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
- అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు.
- హలాల్ విధానంపై నిషేధం విధించారు.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం ధామీ, ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2022 మే 27న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. రెండేళ్లు తర్వాత కమిటీ నివేదికను అందించింది. యూసీసీ ముసాయిదాను గతేడాది ఫిబ్రవరి 6న అసెంబ్లీ ప్రవేశపెట్టగా, మురుసటి రోజు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 28న గవర్నర్ ఆమోదించగా, మార్చి 11న బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు.