Underwater Metro Kolkata :దేశంలోనే మొట్టమొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంగాల్‌లోని కోల్‌కతాలో తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను మార్చి 6న (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన మొత్తం 16.6 కి.మీల మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్ మధ్యలో ఉంది. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్‌ను 45 సెకన్లలో దాటే మెట్రో రైలు కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త సరికొత్త అనుభూతిని అందించనుంది.
తగ్గనున్న ప్రయాణ సమయం
సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు. బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. ఈ సొరంగ మార్గాన్ని నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమిలోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ కారిడార్‌కు ఈ టన్నెల్ నిర్మాణం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుంది. ఇక ఈ అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ల పరిధిలో ఎస్‌ప్లనాడె, మహాకారణ్, హావ్ డా, హావ్ డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.
యూకే సరసన భారత్
మెట్రో టన్నెల్ లోపలికి నీరు చొచ్చుకురాకుండా 1.4 మీటర్ల వెడల్పాటి కాంక్రీటు రింగులను ఫిక్స్ చేశారు ఇంజినీర్లు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గాస్కెట్లనూ అమర్చారు. ఈ తరహా టెక్నాలజీని యూరోస్టార్ అనే కంపెనీ లండన్, ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ఇక ఈ ప్రతిష్ఠాత్మక హుగ్లీ అండర్‌వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్‌కూ ఈ ఘనత దక్కింది.
66 రోజుల్లోనే తవ్వకం
టన్నెల్‌ను తవ్వడానికి బాహుబలి యంత్రాలను వాడారు. జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ మిషన్ సొరంగాన్ని తవ్వింది. కాగా, ఈ అండర్‌వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేశారు మెట్రో అధికారులు.