Ujjwala LPG Subsidy :లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.300 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-2025) వరకు పొడిగించింది. ఈ మేరకు మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. కాగా, ఈ నెల 31వ తేదీతో సబ్సిడీ గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్రం. అయితే ఈ నిర్ణయం పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
"మోదీజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేబినెట్ ఆరు ప్రధాన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. మొదటిది శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహిణిలకు వంటగ్యాస్ సబ్సిడీ గడువు పెంపుతో తీపి కబురు చెప్పాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 14.12 కేజీల సిలిండర్లపై ఇస్తున్న రాయితీ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచాం."
- పీయూశ్ గోయల్, కేంద్ర మంత్రి
ఏడాదికి 12 సిలిండర్లే
వంటగ్యాస్‌పై సబ్సిడీ గడువు పొడిగింపు నిర్ణయం వల్ల దాదాపు 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.12వేల కోట్ల ఆర్థిక భారం పడనుందని మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. అయితే ఏడాదికి 12 సిలిండర్ల వరకు మాత్రమే ఈ రాయితీ లభిస్తుంది. గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016 మే నెలలో ప్రధాన మంత్రి ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుపేద మహిళలకు ఉచితంగానే గ్యాస్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు.
సబ్సిడీ ఇలా అందుతుంది
సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ.300కు పెంచింది. ప్రస్తుతం దిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.903గా ఉంది. ఆ లెక్కన ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.603కే ఒక వంటగ్యాస్ లభిస్తుంది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు సగటున ఏడాదికి 3.68 రీఫిల్స్ వినియోగిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్- 4%పెంపు- 50 శాతానికి DA
'మాకు పవర్ ఇవ్వండి- 30 లక్షల జాబ్స్ గ్యారెంటీ, యూత్‌కు కాంగ్రెస్ పాంచ్ పటాకా హామీలు'