Hydra Demolitions AT manikonda : అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా మరోసారి పంజా విసిరింది. తాజాగా నగరంలోని మణికొండ నెక్నాంపూర్లో పెద్దచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 13 విల్లాల నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈరోజు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్కడ హైడ్రా సిబ్బంది ఇప్పటి వరకు 5 విల్లాలను కూల్చివేశారు. ఇక్కడి నెక్నాంపూర్ చెరువును స్థానికులు కబ్జా చేసిన విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఆ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. కూల్చివేతల సందర్బంగా పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ సమస్య : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో దుర్గంచెరువు పరిసరవాసులను దశాబ్దకాలంగా వేధిస్తున్న ఎఫ్‌టీఎల్ సమస్య త్వరలోనే కొలిక్కిరాబోతుంది. దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ సమస్యను శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేసి నాలుగు నెలల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కారిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు దుర్గంచెరువు పరిధిలోని 6 కాలనీల ప్రతినిధులతో తన కార్యాలయంలో రంగనాథ్ సమావేశమయ్యారు. ఎఫ్‌టీఎల్‌పై అక్కడి స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లెక్కలు తారుమారు : ఎఫ్‌టీఎల్‌పై హెచ్‌ఎండీఏ సహా ఒక్కో విభాగం ఒక్కో లెక్క చెబుతోందని, మిగతా చోట్ల చెరువులు మాయమైతే ఇక్కడ చెరువు ఎఫ్‌టీఎల్ పెరుగుతూ వస్తుందని కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి 65.12 ఎకరాలు కాగా కాలక్రమంలో ఆ లెక్కలు తారుమారుచేసి అధికారులు తమను వేధిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాద్యమాలు, పలు మీడియా సంస్థలు తమను కబ్జాదారులుగా చూపిస్తున్నాయని, అక్కడ ఉన్న తమ స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోతున్నామని వాపోయారు.
స్పందించిన రంగనాథ్ : ఎఫ్‌టీఎల్ నిర్దారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలతోపాటు ఐఐటీ, బిట్స్ పిలానీ, జేఎన్‌టీ యూ లాంటి విద్యాసంస్థల ఇంజినీర్లను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజ్‌లు, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను శాస్త్రీయ పద్దతుల్లో అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తామని రంగనాథ్ తెలిపారు.
చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పడిన హైడ్రా ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కొద్ది రోజుల క్రితమే మాదాపూర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి తన దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు పోతుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను ఆక్రమించి అక్రమార్కుల భరతం పడుతుంది. కొన్ని సందర్భాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలనకు వెళ్తున్నారు.
ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
'హైడ్రా' మళ్లీ మొదలెట్టింది - మాదాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత