తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లివ్-ఇన్'​కు రిజిస్ట్రేషన్ మస్ట్​! అన్ని పెళ్లిళ్లకు ఒకటే రూల్- ఇక నుంచి ఆ రాష్ట్రంలో UCC అమలు - UCC IN UTTARAKHAND

సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి- ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడి

lovers
lovers (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2025, 4:25 PM IST

Updated : Jan 26, 2025, 4:48 PM IST

UCC In Uttarakhand : బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సోమవారం (జనవరి 27) నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందన్నారు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తయిందన్నారు. ఈ మేరకు సీఎం ధామి ఓ ప్రకటన విడుదల చేశారు. "యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తాం" అని ముఖ్యమంత్రి వెల్లడించారు. "వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ సాధనకు ప్రధాని మోదీ చేస్తున్న మహా యజ్ఞం కోసం మేం అందిస్తున్న సమర్పణే యూసీసీ" అని ఆయన చెప్పారు.

ముసాయిదా బిల్లు నుంచి రాష్ట్రపతి ఆమోదం దాకా
గత పదేళ్లుగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ అమలుపై బీజేపీ బలమైన హామీ ఇస్తూ వస్తోంది. ఎట్టకేలకు దాన్ని అమలు చేసే రోజు(2025 జనవరి 27) రానే వచ్చింది. అయితే యూసీసీ ముసాయిదా రూపకల్పనకు రాష్ట్ర సర్కారు పెద్ద కసరత్తు చేసింది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. ఈ కమిటీ దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి నాలుగు సంచికల్లో సవివరమైన, సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. ఈక్రమంలో ఉత్తరాఖండ్‌లోని అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. 2024 ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఇది జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా లభించింది. తదుపరిగా యూసీసీ బిల్లు అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ చీఫ్ సెక్రెటరీ శత్రుఘ్న సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 సంవత్సరం చివర్లో రాష్ట్ర సర్కారుకు నివేదికను సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామికి కట్టబెడుతూ తీర్మానం చేసింది.

యూసీసీలోని కీలక అంశాలివే!

  • వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా యూసీసీ ఉంటుంది.
  • మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు యూసీసీ దోహదం చేయనుంది.
  • సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహ జీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
  • సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.
  • అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది.
  • అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు.
  • హలాల్​ విధానంపై నిషేధం విధించారు.
Last Updated : Jan 26, 2025, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details