Tirumala Laddu Taste Increase:తిరుమల అంటే స్వామి వారిని దర్శిస్తే కనులకు ఎంత ఇంపుగా ఉంటుందో.. తిరుపతి ప్రసాదం తింటే అంత కమ్మగా ఉంటుంది. అందుకే.. తెలిసిన వారు ఎవరైనా తిరుపతి వెళ్లారంటే మొహమాటం లేకుండా లడ్డూ ప్రసాదం ఎక్కడ? అని అడుగుతారు. తిరుపతి లడ్డూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా చాలా ఫేమస్. ఇంత ప్రాచుర్యం పొందిన శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గిందనే అభిప్రాయం చాలా కాలం నుంచి భక్తులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో తిరుమలకు మంచి రోజులు రాబోతున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూలని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు పలు సూచనలు చేశారు. శ్రీవారి లడ్డూ నాణ్యతను మరింత పెంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి విషయంపై ఫోకస్ చేశారు. నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి..? కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి? వంటి అనేక అంశాలపై చర్చించారు.
లడ్డూ నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్ మార్క్, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలి? అనే విషయాలను అధికారులకు వివరించారు. లడ్డూ నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యిని సమకూర్చుకోవడానికి త్వరలోనే సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఈవో ఆదేశించారు.