Interesting Facts About Flying Snakes :పాములు అంటే.. జర..జర.. నేలపై పాకుతాయని అందరికీ తెలుసు. మరి.. అవే పాములు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది? మన ఇళ్ల మీదకు వచ్చి పడితే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే.. భయమేస్తోంది కదా! కానీ.. రయ్యిమంటూ గాల్లో ఎగిరే పాములు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవును.. మీరు వింటున్నది నిజమే! ఇటీవల బీహార్‌లో ఇలాంటి పాము కనిపించింది. ఇంతకీ.. ఆ పాము(Snake) పేరేంటి? అది నిజంగా గాల్లో ఎగురుతుందా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇటీవల బీహార్‌లో గాల్లో ఎగిరే పాము కనిపించింది. దాని పేరు.. తక్షక్ స్నేక్. ఇది ఎక్కువ సౌత్ఈస్ట్ ఆసియా అడవుల్లో కనిపిస్తుంది. తక్షక్ పామునే.. ఆర్నెట్స్ ఫ్లయింగ్ స్నేక్, టక్కా నాగ్, గ్లైడింగ్ స్నేక్, క్రైసోపెలియా అనే వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే.. ఈ పాము మరీ పక్షిలా ఎగురుతూ విహరించదుగానీ.. గాలిలో తేలుతుంది. ఇది తన శరీరాన్ని ఎగరడానికి వీలుగా చదునుగా మార్చుకొని చటుక్కున గాల్లో ఎగురుతుందంటున్నారు నిపుణులు.
దీని పొట్టకున్న ప్రత్యేకత వల్ల చెట్లపైకి చకచకా ఎక్కేస్తుందని చెబుతున్నారు నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ(NEWS) ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్. అంతేకాదు.. ఒక కొమ్మ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుమీదకు గాల్లో ఎగురుతూ దూకేస్తుందంటున్నారు. ఆహార వేట కోసం, ఇంకా భూమ్మీదుండే శత్రుజీవుల నుంచి తప్పించుకోవడానికే ఇలా ఇది ఎగురుతుందని చెబుతున్నారు.
తక్షక్ పాము శరీరంపై గంధపు మరక ఉంటుంది. దీని పొడవు 3 నుంచి 4 అడుగులు ఉంటుంది. ఇది సాధారణంగా పొడవైన చెట్లపై నివసిస్తుంది. ఈ పాము కాస్త సన్నగా ఉంటుంది. ఇది తన శరీరాన్ని S ఆకారంలోకి మార్చుకొని స్ప్రింగ్ లాగా దూకగలదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాము ఒకేసారి దాదాపు 100 మీటర్ల దూరం గాల్లో ఎగురుతూ వెళ్లగలదని అంటున్నారు.