తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్ - ఇరుముడికట్టులో ఆ వస్తువులు తేవొద్దని బోర్డు విజ్ఞప్తి

ట్రావెన్ కోర్​ దేవస్వమ్ బోర్డు కీలక సూచన- ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్​వాటర్ తీసుకురావొద్దని విజ్ఞప్తి

Sabarimala
Sabarimala (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Sabarimala News Today :శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్​కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్​వాటర్ తీసుకురావొద్దని కోరింది. ఈ మేరకు ట్రావెన్‌ కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. త్వరలో ఈ విషయంపై సర్య్కులర్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొచ్చి, మలబార్ దేవస్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు!
కర్పూరం, అగరబత్తీలు పూజా సామగ్రి అయినప్పటికీ, వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్​కోర్ దేవస్వామ్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నిదానంలో అగరబత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు. దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయి. వీటిని పండితతవళంలోని దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే దేవస్వమ్ బోర్డు ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

ఆలయ ప్రధాన పాలకుడు(తంత్రి) రాజీవరు ఇరుముడికట్టులో అగరబత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్వామ్ బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. "పూర్వం భక్తులు కాలినడకన వచ్చినప్పుడు అన్నం, కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్ని చోట్లా ఆహారం దొరుకుతోంది. కాబట్టి ఇరుముడికట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం తెచ్చుకోండి. వాటిని శబరిమలలో సమర్పించవచ్చు" అని లేఖలో పేర్కొన్నారు.

రోజుకు 10వేల మంది యాత్రికులకు స్పాట్ బుకింగ్
మండల పూజల సమయంలో శబరిమల దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్​పై దేవస్వమ్ బోర్డు స్పష్టత ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ కోసం భక్తుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫొటోతో కూడిన ప్రత్యేక పాస్ కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసుకున్న యాత్రికుల సమాచారం అంతా తెలుసుకునే విధంగా పాస్ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కాగా, స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పను రోజుకు 10,000 మంది దర్శనం చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70,000 మంది దర్శనం చేసుకోవచ్చు.

పంబా, ఎరుమేలి, సత్రంలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుంది దేవస్థానం బోర్డు. పంబా రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్కడ కౌంటర్ల సంఖ్యను పెంచనుంది. కానీ నిలక్కల్, పంతలంలో కౌంటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పంబాలో ట్రాఫిక్ పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇరుముడికట్టుతో వచ్చే యాత్రికులు ఎవరూ అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details