Transgender Catering Business In Tamilnadu :ట్రాన్స్‌జెండర్లంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు. ఛీత్కారాలు! చాలా మంది కుటంబ సభ్యుల ఆదరణకూ నోచుకోరు! అయితే ఇలాంటి అవమానాలు, అవాంతరాలు అన్నింటినీ దాటుకుని తన కాళ్ల మీద తాను నిలబడమే కాకుండా, తనలాంటి వాళ్లను ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేలా చేస్తోంది ఓ ట్రాన్స్‌జెండర్. ఆమే క్యాటరింగ్ బిజినెస్‌లో దూసుకెళ్తున్న 'సెల్వీ అమ్మ'. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సెల్వీ, ఆమెతో నడిచిన 40మంది ట్రాన్స్‌జెండర్ల టీమ్ వారి అనుభవాలను "ఈటీవీ భారత్"తో షేర్ చేసుకున్నారు.
'అమ్మ'గా వండి పెడుతోంది
కోయంబత్తూరుకు చెందిన సెల్వీ(50) అనే ట్రాన్స్‌జెండర్ క్యాటరింగ్ బిజినెస్‌లో దూసుకుపోతోంది. అందరితో 'సెల్వీ అమ్మ' అనిపించుకునే స్థాయికి ఎదిగింది. అయితే ఈ విజయం సెల్వీకి అంత సులువుగా దక్కలేదు. తాను కూడా అందరు ట్రాన్స్‌జెండర్ల లాగానే అనేక సవాళ్లను ఎదుర్కొంది. సమాజంలో తమలాంటి వారిపై ఉన్న చిన్నచూపు, ఛీత్కారాలను దాటి, తాను కూడా ఏదైనా సాధించాలనే పట్టుదలతో కష్టపడింది. ఈ క్రమంలో వంటల్లో, ముఖ్యంగా బిర్యానీ చేయడంలో మెలకువలు నేర్చుకుని ఆరితేరింది. అందులో ముఖ్యంగా సెల్వీ అమ్మ చేసే, 'రవ్తర్' బిర్యానీ చాలా ఫేమస్. ఫలితంగా, పొరుగు రాష్ట్రం కేరళ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది తమ ఇంటి కార్యక్రమాల కోసం సెల్వీ అమ్మ చేత వంట చేయించుకోవడానికి నెలల తరబడి నిరీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
తనలాంటి వారిని చేరదీసి
స్వతహాగా ట్రాన్స్‌జెండర్ల కష్టాలను అనుభవించింది సెల్వీ. అయితే తనలాంటి వారికి సహాయపడాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆమె చేసిన పని చాలా మంది ట్రాన్స్జెండర్లకు ఓ దిక్సూచి అయింది. నిరుద్యోగ ట్రాన్స్జెండర్లను చేరదీసి, కనీసం టీ పెట్టడం రాని వారికి కూడా వంటల్లో మెలకువలు నేర్పింది. అలా ఒక్కొక్కరుగా సెల్వీ అమ్మ టీమ్‌లో భాగస్వాములయ్యారు. ఇప్పుడు సెల్వీ క్యాటరింగ్ టీమ్‌లో 40మంది ఉన్నారు.