Train Accident In Rajasthan :రాజస్థాన్ అజ్మేర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్ స్టేషన్ సమీపంలో ఉన్న గూడ్స్ రైలును సబర్మతి ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఫలితంగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ తెలిపారు. ఈ ఘటన కారణంగా ఆరు రైళ్లు రద్దు చేశామని, మరో రెండు రైళ్లను వేరే మార్గాల ద్వారా మళ్లించామని కిరణ్ పేర్కొన్నారు. అజ్మేర్ రైల్వే స్టేషన్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సమాచారం కోసం 0145-2429642 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు.
సబర్మతి రైలులో ప్రయాణిస్తున్న వారిని అజ్మేర్ రైల్వే స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపిస్తామని చెప్పారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు అజ్మేర్ రైల్వే డిఆర్ఎమ్ రాజీవ్ ధన్కర్ చెప్పారు.