Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతీ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేట్టుగా.. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా.. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండు, మూడో రోజు ఇలా..
రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితోపాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులు.. శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.