తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీకే సావిత్రి జిందాల్ సహా ఆ ముగ్గురి సపోర్ట్​- మోదీని కలిసిన హరియాణా సీఎం - HARYANA POLITICS BJP

హరియాణాలో బీజేపీకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు- పెరిగిన కమలం పార్టీ బలం

Haryana Politics BJP
Haryana Politics BJP (ANI, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 4:54 PM IST

Haryana Politics BJP :ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయం సాధించిన వేళ, తాజా ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా కమలం పార్టీకే మద్దతు ప్రకటించారు. భారత్‌లోనే సంపన్న మహిళా నేతగా నిలిచిన సావిత్రి జిందాల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన దేవేందర్‌ కడ్యాన్‌, రాజేశ్‌ జూన్‌ బీజేపీ అధినాయకత్వంతో భేటీ అయ్యారు.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర ప్రధాన్‌ను తన నివాసంలో కలిసిన ఎమ్మెల్యేలు కడ్యాన్‌, రాజేశ్‌ జూన్‌ బీజేపీకి మద్దతు తెలిపారు. సావిత్రి జిందాల్‌ కూడా ఆ పార్టీకే మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగి గనౌర్‌ నుంచి గెలుపొందారు కడ్యాన్‌. కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ శర్మపై 35,209 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రాజేశ్‌ జూన్‌ కాంగ్రెస్ రెబల్​గా బరిలో దిగి బీజేపీ అభ్యర్థి దినేష్ కౌశిక్​ను ఓడించి బహదూర్‌గఢ్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

సావిత్రి జిందాల్‌ గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005, 2009లో హిస్సార్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున ఆ స్థానం నుంచే బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ ఆమెకు టికెట్‌ దక్కకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. తాజాగా బీజేపీ రికార్డు విజయం నమోదు చేయడం వల్ల తిరిగి ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

'బీజేపీ విజయానికి పథకాలే కారణం'
మరోవైపు, హరియాణా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం కలిశారు. హరియాణాలో బీజేపీ విజయానికి మోదీ అమలు చేసిన విధానాలు, పథకాలే కారణమని సైనీ తెలిపారు. గత పదేళ్లలో పేదలు, రైతులు, మహిళలు, యువతతోపాటు సమాజంలోని అన్నివర్గాల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. ప్రజల మద్దతుతోనే మూడోసారి బీజేపీ గెలుపొందినట్లు సైనీ పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు మాత్రం బీజేపీపై నమ్మకం ఉంచారని అన్నారు. ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయటం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.

"ఈవీఎంలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తారని 4 రోజుల క్రితమే నేను చెప్పాను. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అలాంటి పరిస్థితులు కల్పించింది. అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చింది. ప్రధాని మోదీ సారథ్యంలో పదేళ్లలో మేం ఎన్నో కార్యక్రమాలు చేశామని చెప్పాను. హరియాణాలో మూడోసారి భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసంతో చెప్పాను. ఆ విషయాన్ని హరియాణా ప్రజలు నిరూపించారు."

- నాయబ్‌ సింగ్‌ సైనీ, హరియాణా ముఖ్యమంత్రి

బుధవారం వెలువడిన ఫలితాల్లో హరియాణాలోని 90 సీట్లకు గానూ 48 చోట్ల జయకేతనం ఎగురవేసింది బీజేపీ. ఉదయం కౌంటింగ్‌ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించింది. గంట తర్వాత క్రమంగా ఫలితాలు తారుమారవడం ప్రారంభించి చివరకు బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ 37 సీట్ల వద్దే ఆగిపోయింది. కొన్నిచోట్ల మెజారిటీలు అత్యల్పంగా నమోదవడం వల్ల రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంది.

ABOUT THE AUTHOR

...view details