Threat Call For PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు దిగాడు. తమిళనాడు చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్‌ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు
గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోదీని చంపేస్తానని హిందీలో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు? ఏ సిమ్ కార్డు వాడాడు? అనే విషయాలను తెలుసుకునే పనిలో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసు కంట్రోల్ నంబర్స్‌ను ఇటీవల ప్రకటించింది. ఈ నెంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.
ప్రధాని మోదీ, యోగికి బెదిరింపులు
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతానంటూ కొన్నాళ్ల క్రితం ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్ చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. దేశ ప్రధానినే చంపుతామని బెదిరింపులు రావడం వల్ల పోలీసులు ఈ కేసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.