Bombs At Assam Today : అసోంలో 19 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తిరుగుబాటు సంస్థ ఉల్ఫా ఐ ప్రకటించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల పేలుళ్లు జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వ్యతిరేకిస్తూ మయన్మార్ కేంద్రంగా పనిచేసే ఉల్ఫా ఐ, అసోంలోని పలు ప్రాంతాల్లో బాంబుదాడులకు ప్రయత్నించింది. ఈ మేరకు ఉల్ఫా ఐ నేత ఇషాన్ అసోమ్ ప్రకటన విడుదల చేశారు.
నిరసనలు తెలియజేయడానికే!
19 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపారు. బాంబులు అమర్చిన ప్రాంతాల పేర్లను కూడా వెల్లడించారు. ఒక్క గువాహటిలోనే 8 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు ఇషాన్ పేర్కొన్నారు. 'స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మా నిరసనలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన బాంబులు పేలలేదు. ముందుగా నిర్ణయించినట్లుగా ఆగస్టు 15వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు దాడులు జరగాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల బాంబు పేలుళ్లు జరగలేదు' అని ఇషాన్ అసోమ్ తెలిపారు.
ముఖ్యంగా గువాహటిలో!
తాము అమర్చిన బాంబులను నిర్వీర్యం చేయాలని ఇషాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఉల్ఫా ఐ ప్రకటన నేపథ్యంలో అసోం పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా గువాహటిలోని 8 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలపడం వల్ల పోలీసులు అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.
కొన్నిరోజుల క్రితందేశ రాజధాని దిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో ఉన్న పదుల సంఖ్యలో విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారక, వసంతకుంజ్, నోయిడా సెక్టార్ 30లోని దిల్లీ పబ్లిక్ స్కూళ్లు, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, సాకేత్‌లోని అమిటీ సహా 97 స్కూళ్లకు మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అప్పుడు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఐదు పాఠశాలలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.