Teacher Shoots Colleagues In School : ఇద్దరు ఉపాధ్యాయులను అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ టీచర్. ఈ దారుణం ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. కాగా, ఈ ఘటనలో కాల్పులకు తెగబడ్డ ఆ టీచర్ సైతం గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది
రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని పోరైయాహత్ ప్రాంతంలోని అప్‌గ్రేడెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు టీచర్లు పనిచేస్తున్నారు. రోజులాగే మంగళవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన వీరందరూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో ఓ టీచర్, తనతో తెచ్చుకున్న తుపాకీతో తన సహోద్యుగులను కాల్చిచంపినట్లుగా పోలీసులు చెప్పారు. వారిని కాల్చిన అనంతరం అదే తుపాకీతో నిందితుడు కాల్చుకోగా, తీవ్రంగా గాయపడినట్లుగా గొడ్డా జిల్లా ఎస్పీ నాథు సింగ్ మీనా మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం అతడు గొడ్డాలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా చెప్పారు.
"ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నిందితుడు (టీచర్) తనవెంట తెచ్చుకున్న తుపాకీతో మంగళవారం ఉదయం అదే స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపాడు. మృతుల్లో ఒకరు మహిళా టీచర్ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే మేము ఘటనాస్థలికి చేరుకున్నాము. తరగతి గదిలో రక్తపుమడుగులో పడిఉన్న మృతదేహాలను ఆస్పత్రికి తరలించాము. ఈ ఘటనలో నిందితుడైన ఉపాధ్యాయుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు."
- నాథు సింగ్ మీనా, గొడ్డా జిల్లా ఎస్పీ
తానూ సూసైడ్ చేసుకుందామని
'తుపాకీ కాల్పుల శబ్దం విన్న పాఠశాల విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు ఘటన జరిగిన గది వద్దకు పరుగులు తీశారు. అయితే గది లోపలినుంచి గడియపెట్టి ఉండటం గమనించిన వారు మాకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని తలుపులను పగులగొట్టాము. నిందితుడు ఇద్దరు టీచర్లను తలపై అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. దీంతో వారు స్పాట్లోనే మృతి చెందారు. అనంతరం కాల్పులు జరిపిన ఉపాధ్యాయుడు తన కుడివైపున కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి' అని ఎస్పీ వివరించారు.
ఇదే కారణమా?
అయితే, ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఇద్దరు పురుష టీచర్లు, ఓ మహిళా ఉపాధ్యాయురాలి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామస్థులు, విద్యార్థులు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లుగా పోలీసులు అన్నారు. ఇక మృతులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని చందోలికి చెందిన సుజాతా మిశ్రా (35), ఆదర్శ్ సింగ్ (40)గా గుర్తించారు పోలీసులు. గాయపడిన ఉపాధ్యాయుడిని పోరైయాహత్కు చెందిన రవి రంజన్ (42)గా నిర్ధరణకు వచ్చారు. నిందితుడు టీచర్ ఆదర్శ్ సింగ్‌పై మూడు బుల్లెట్లు, సుజాతా మిశ్రాపై ఒక బుల్లెట్ వదిలినట్లుగా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక కాల్చేందుకు అతడు రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్‌ను వెంట తెచ్చుకోగా అందులో ఒకదానితో మాత్రమే కాల్పులు జరిపాడని చెప్పారు. ఘటన జరిగిన గది నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీఎం కార్లు సీజ్ చేసిన ఈడీ- సోదాల్లో రూ.36లక్షలు స్వాధీనం- భార్యకు పగ్గాలు!
'7నెలలు ఎదురుచూశాం- అయినా స్పందన లేదు'- కాంగ్రెస్‌పై అభిషేక్ బెనర్జీ ఫైర్